ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌

‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ ఈ పదం పాతదే అయినా ఇప్పుడున్న ఫ్యాషన్‌ లవర్స్‌కి ఇది కొత్తే. ఎందుకంటే వాళ్లకు పాత సంప్రదాయాలు, కట్టు బొట్టు గురించి తెలియదు కాబట్టి. ఎవరైనా అందరికంటే కొంచెం విభిన్నా కనపడాలి. అందరి కళ్లు మనవైపే ఉండాలని ఆడవాళ్లు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అయితే.. ఇప్పుడు ట్రెండ్‌ మళ్లీ పాత ట్రెండ్‌లోకి వెళ్లింది. అప్పుడున్న నగలు, చీరలు కొత్త మేళవింపులతో మళ్లీ మనముందుకొచ్చేస్తాయి.

ఫ్యాషన్‌ అనే ఈ పదానికి ఎళ్లలు లేవు. ఈ ట్రెండ్‌ ఎంతగా ఆకట్టుకుందంటే.. ఈ తరం పెళ్లిళ్లు అన్నీ కట్టు బొట్టులో పాత కళకు పడతులు పట్టం కడుతున్నారు. ఆభరణాల అలంకరణలోనూ పాత సొబగులకే వోటేస్తున్నారు.

‘పెళ్లి’ రెండక్షరాల మాటైనా రెండు బంధాలను ఒకటి చేస్తుంది. పెళ్లిళ్లలో చుట్టుపక్కల వారి హంగామే సగం అయితే ఇక పెళ్లి కూతురు గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నెన్ని షాపులు తిరిగి తిరిగి అలిసిపోతూ ఉంటారు. పెళ్లి కుదరగానే ముందు పట్టు దుస్తుల మీదకు వెళతాయి ఇంట్లో వారి ఆలోచనలు. ముందుగానే కేటాయించిన బడ్జెట్‌లో కంచిపట్టు ప్రధానంగా ఉంటుంది. వీటితో పాటు బెనారస్‌ మనవైన చేనేతలు గద్వాల, నారాయణపేట, ఇక్కత్, ఉప్పాడ వంటివి ఉంటున్నాయి.

అమ్మమ్మల కాలంనాటి చీరనా అని పెదవి విరిచే అమ్మాయిలు ఇప్పుడు ఇలాంటి డిజైన్స్‌నే అపురూపంగా ఎంచుకుంటున్నారు. వీటితో పాటు బ్లౌజ్‌ డిజైనింగ్‌లో ‘పాత కళ’నే ఇష్టపడుతున్నారు. వీటిలోనూ ముదురు రంగులు, పాతగా అనిపించే జరీ జిలుగులు, చెక్స్‌ వంటి డిజైన్లకే ఓటేస్తున్నారు వధువులు. వీటి రూపురేఖలు  అమ్మమ్మల కాలం నాటివేమో అనిపించేలా ఉంటున్నాయి. అమ్మ, అమ్మమ్మల స్టైల్‌ బహుబాగు అంటున్నారు. మోచేతుల వరకు ఉండే జాకెట్టు స్లీవ్స్‌ మరో ఆకర్షణ అవుతున్నాయి. బ్లౌజ్‌కు రకరకాలుగా గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేయించుకోవడం పాత జాబితాలో చేరిపోయింది. కాంట్రాస్ట్‌ రంగులు లేదంటే చీరలోనే వచ్చే పీస్‌తో డిజైన్‌ చేసిన బ్లౌజ్‌లు ఇప్పుడు మళ్లీ ముందుకు వచ్చాయి.

అలాగే.. నగల సంగతికొస్తే.. అంత ఆషామాషాగా కుదిరే పని కాదు. మామిడిపిందెలు, చంద్రహారాలు, కాసుల పేర్లు ఆభరణాలలోనూ పాత డిజైన్లవైపు మక్కువ చూపుతు న్నారు. దీంతో అలాంటి ఆభరణాలు  పెళ్లింట కళకళలాడుతున్నాయి.

ఇక ముచ్చటగొలిపే జడల దగ్గరకొస్తే.. ఎన్ని హెయిర్‌స్టైల్స్‌ వచ్చినా ఇప్పటికీ అమ్మమ్మల కాలం నాటి కొప్పులే పెళ్లికి కరెక్ట్‌ హెయిర్‌ స్టైల్‌. కొప్పు వేసి, ఆ కొప్పు చుట్టూ పువ్వులను చుడితే వచ్చే కళ మరే హెయిర్‌స్టైల్‌కి రాదన్నది స్టైలిస్టులమాట.

leave a reply