లెక్కించడంలో ఫీల్డ్ అంపైర్ విఫలం!

శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో డీఆర్ఎస్‌పై ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌ దార్‌ చేసిన తప్పిదం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. డర్బన్ వేదికగా  ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు  దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో విశ్వ ఫెర్నాండో వేసిన రెండో ఓవర్‌లోనే సఫారీ ఓపెనర్ డీన్‌ ఎల్గర్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో మరొక బంతి నేరుగా వచ్చి ఆమ్లా ప్యాడ్లకు తాకింది. అయితే ఎల్బీ కోసం ఫెర్నాండో అప్పీల్‌ చేయగా ఫీల్డ్ అంఫైర్ అలీమ్‌ దార్‌ తిరస్కరించాడు. అనంతరం శ్రీలంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే రివ్యూ అడగగా. సమయం మించిపోయిందంటూ అంఫైర్ రివ్యూకు ఒప్పుకోలేదు.

అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి డెడ్‌ అయ్యాక 15 సెకండ్ల వరకు మాత్రమే రివ్యూ కోరాలి. సమయం మించిపోతే రివ్యూ అడిగే అవకాశం కోల్పోతారు. అందుకు అంపైర్ 10 సెకన్లు పూర్తిన వెంటనే డీఆర్‌ఎస్‌ సమయాన్ని గుర్తు చేయాలి. కానీ, అలీమ్‌ దార్‌ ఎలాంటి హెచ్చరిక చేయకపోవడం… శ్రీలంక కెప్టెన్‌ నిర్ణీత సమయం 13.78 సెకన్లలోపే అప్పీల్‌ చేసినా తిరస్కరించడం ఇప్పుడు వివాదంగా మారింది. దాంతో డీఆర్‌ఎస్‌ సమయాన్ని లెక్కించడంలో అంపైర్‌ విఫలమయ్యాడని  విమర్శల వర్షం కురుస్తోంది.

ఇటీవల భారత్‌తో జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ ఆటగాడు డార్లీ మిచెల్‌ ఎల్బీగా ఔటైన తీరు కూడా ఇలాగే వివాదాస్పదమైంది. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మిచెల్ (1) ఎల్బీగా అవుట్ అయ్యాడు. మొదట అంపైర్  మిచెల్ ఔట్ అని ప్రకటించగా… ఆపై అవతలి ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సంప్రదించిన తర్వాత మిచెల్ డీఆర్‌ఎస్‌కు వెళ్లాడు. హాట్ స్పాట్‌లో బ్యాట్‌కు బంతి తగిలినట్లు కనిపించినా, స్నికో మీటర్‌లో దీనికి విరుద్దంగా కనిపించడంతో, బాల్‌ ట్రాకింగ్‌ ఆధారంగా థర్డ్‌ అంపైర్‌  ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఇది వివాదాస్పమైంది.

leave a reply