సెరెనా..జోరు…!

మెల్‌బోర్న్‌: తల్లి హోదా వచ్చాక తన ఆటలో మరింత పదును పెరిగిందని అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ రుజువుచేసింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ఈ మాజీ చాంపియన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మూడో రౌండ్‌లో తన అక్క వీనస్‌ విలియమ్స్‌ను ఓడించిన ప్రపంచ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)పై సెరెనా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. ఉత్కంట భరితంగా సాగిన మ్యాచ్ లో  మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 16వ సీడ్‌ సెరెనా 6–1, 4–6, 6–4తో టాప్‌ సీడ్‌ హలెప్‌ను బోల్తా కొట్టించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెరెనాపై హలెప్‌ గెలిచుంటే ఒకే టోర్నీలో విలియమ్స్‌ సిస్టర్స్‌ వీనస్, సెరెనాలను ఓడించిన తొమ్మిదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేది. 

తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందం హలెప్‌నకు ఎక్కువసేపు నిలువలేదు. మొదట్లో గట్టి పోటీ ఇచ్చిన ఆమె వరుసగా ఆరు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను సెరెనాకు అప్పగించేసింది. అయితే రెండో సెట్‌లో పరిస్థితి మారిపోయింది. ప్రతి పాయింట్‌ కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. సెరెనా ఆటకు తగిన సమాధానమిస్తూ హలెప్‌ స్కోరు 5–4 వద్ద బ్రేక్‌ పాయింట్‌ సంపాదించి రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో స్కోరు 3–2 వద్ద సెరెనా సర్వీస్‌లో హలెప్‌ మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. తన అద్భుత పోరాట ప్రతిమతో సర్వీస్‌ను కాపాడుకున్న సెరెనా స్కోరును 3–3తో సమం చేసింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో హలెప్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఆమె 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో హలెప్‌ తన సర్వీస్‌ను కాపాడుకుంది. మ్యాచ్‌లో నిలవాలంటే పదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కచ్చితంగా బ్రేక్‌ చేయాల్సిన హలెప్‌ చేతులెత్తేయడంతో మ్యాచ్‌ సెరెనా వశమైంది.

ఓవరాల్‌గా హలెప్‌పై సెరెనాకిది తొమ్మిదో విజయం. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మూడోది. గతంలో వీరిద్దరు తలపడిన రెండు  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌లు (2016 యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌; 2011 వింబుల్డన్‌ రెండో రౌండ్‌) కూడా మూడు సెట్‌లపాటు సాగడం విశేషం. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో సెరెనా ఆడుతుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్లిస్కోవా 6–3, 6–1తో 18వ సీడ్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌)పై విజయం సాధించింది. 

మరోవైపు నాలుగో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌), ఆరో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) క్వార్టర్‌ ఫైనల్‌ చేరేందుకు తీవ్రంగా శ్రమించారు. 13వ సీడ్‌ సెవస్తోవా (లాత్వియా)తో గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 4–6, 6–3, 6–4తో గెలుపొందింది. 17వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)తో గంటా 36 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా 6–2, 1–6, 6–1తో నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లో ఒసాకాతో పోరుకు సిద్ధమైంది. 

leave a reply