`అంతరిక్ష్యం’ రివ్యూ..

తన మొదటి సినిమా కంచెతో వైవిధ్యమైన చిత్రాలను, పాత్రలను ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్నారు వరుణ్‌ తేజ్‌. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఎవ్వరూ టచ్‌ చేయని కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. ‘ఘాజి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ విజయాలు అందుకున్న వరుణ్‌.. ‘అంతరిక్షం’ చిత్రంతో హ్యాట్రిక్‌ కొడతారా? లేదో..! చూడాలి..

స్టోరీ ఎలా ఉందో.. చూద్దాం..

భార‌త అంత‌రిక్ష యానం నుంచి పంపిన ఓ శాటిలైట్ అనుకోని స‌మ‌స్య‌ల్ని తీసుకొస్తుంది. ఆ శాటిలైట్ ప‌నిచేయ‌క‌పోవ‌డం వ‌ల్ల‌.. మిగిలిన శాటిలైట్‌ల‌కు ముప్పు ఏర్ప‌డుతుంది. దాన్ని త‌ప్పించ‌క‌పోతే… ప్ర‌పంచంలోని మొత్తం క‌మ్యునికేష‌న్ వ్య‌వ‌స్థ‌పై పెను ప్ర‌భావం ప‌డుతుంది. ఆ ముప్పు నుంచి త‌ప్పించ‌గ‌లిగే ఒకే ఒక్క వ్య‌క్తి దేవ్ (వ‌రుణ్ తేజ్‌). ఈ శాటిలైట్‌కి సంబంధించిన కోడింగ్‌, అన్ కోడింగ్ త‌న‌కు బాగా తెలుసు. కాక‌పోతే.. త‌న వృత్తికి దూరంగా ఎక్క‌డో… మారు మూల గ్రామంలో ఓ టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. వృత్తిని దైవంగా, ప్రాణంగా భావించే దేవ్‌.. ఈ ఉద్యోగానికి దూరంగా ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది? ఈ దేశ ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కు సంబంధించిన ఓ శాటిలైట్ ప్ర‌యోగాన్ని దేవ్ ఎంత దిగ్విజ‌యంగా పూర్తి చేశాడు? అనేదే క‌థ‌..

విశ్లేష‌ణ‌

తెలుగు సినిమాకి సంబంధించినంత వ‌ర‌కూ ఇలాంటి ఆలోచ‌న‌తో ఓ క‌థ త‌యారు చేసుకుని రావ‌డం, ఓ హీరో ఒప్పుకోవ‌డం, ఓ నిర్మాత ఈ సినిమా చేయ‌డానికి ముందుకు రావ‌డం.. అభినందించ‌ద‌గిన విష‌యాలు. అంత‌రిక్షంతో ముడి ప‌డి ఉన్న క‌థ‌ల్ని మ‌నం కూడా తీయ‌గ‌లం అని చూపించిన సినిమా ఇది. అంత‌రిక్షంలో ఏం జ‌రిగింది? అనే పాయింట్‌కి ముందు రాసుకున్న ఉప‌క‌థ‌లు.. అస‌లు క‌థ‌కీ, ఆ క‌థాగ‌మ‌నానికీ ఉప‌యోగ‌ప‌డేలా చూసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడి తెలివితేట‌లు క‌నిపిస్తాయి. లావ‌ణ్య త్రిపాఠి పాత్ర‌కూ, క‌థానాయ‌కుడి ల‌క్ష్యానికీ ఓ లింకు ఉంటుంది. కాబ‌ట్టి… ఎమోష‌న్ గా డ్రైవ్ అయ్యే పాయింట్ దొరికింది. తొలి స‌గం.. లావ‌ణ్య‌తో ప్రేమ‌క‌థ‌, శాలిలైట్‌కి వ‌చ్చిన ముప్పు… వీటి చుట్టూనే సాగింది. ద్వితీయార్థంలో అంత‌రిక్ష‌యానం మొద‌లైంది. అలాంటి స‌న్నివేశాలు చూడ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా కొత్త‌. కాబ‌ట్టి… అదో సేల్ బుల్ పాయింట్ అవుతుంది. సైన్స్‌ గురించి కొద్దో గొప్పో తెలిసిన వారికి ఈ సినిమా అర్థమవుతుంది.

ప్రేక్ష‌కుడు ఊపిరి బిగ‌బెట్టుకుని చూసేలా స‌న్నివేశాల్ని సృష్టించ‌డంలో ర‌చ‌యిత‌గా సంక‌ల్ప్‌రెడ్డి విఫ‌లయ్యాడు. దాంతో..  తెర‌పై దేవ్ క‌ష్ట‌ప‌డుతున్నా, ఆక్సిజ‌న్ లేకుండా ఇబ్బంది ప‌డుతున్నా, బ‌తుకుతాడో, లేదో కూడా చెప్ప‌లేని స్థితికి వ‌చ్చినా, ప్రేక్ష‌కుల్లో చ‌ల‌నం ఉండ‌దు. ఇలాంటి క‌థ‌లు ఎలా మొద‌ల‌వుతాయో, ఎలాంటి మ‌లుపులు వ‌స్తాయో, చివ‌రికి ఏమ‌వుతుంద‌న్న‌ది ప్రేక్ష‌కుల‌కు కొట్టిన పిండే. హీరో గెలిచి – దేశ ప‌తాక‌ని రెప‌రెప‌లాడిస్తాడు. చివ‌రికి ఇక్క‌డా అదే జ‌రిగింది.

న‌టీన‌టులు

వ‌రుణ్‌తేజ్ క‌థ‌ల ఎంపిక బాగుంటుంది. ఆస్ట్రోనాట్‌గా క‌నిపించే అవ‌కాశం మ‌రో హీరోకి దొర‌క‌దు. ఇలాంటి పాత్ర‌లు అరుదుగా వ‌స్తుంటాయి. ఆ అవ‌కాశాన్ని వ‌రుణ్ అందిపుచ్చుకున్నాడు. లావ‌ణ్య‌, అతిథి పాత్ర‌లు గ్లామ‌ర్ కోస‌మో, హీరోయిన్లు ఉండాల‌నో పెట్టిన‌వి కావు. పాత్ర‌ల‌కు ఎప్పుడైతే వెయిటేజీ ఉంటుందో.. అప్పుడు ఆ పాత్ర‌లు రాణిస్తాయి. వీరిద్ద‌రి విష‌యంలోనూ అదే జ‌రిగింది. రెహ‌మాన్‌, అవ‌స‌రాల, స‌త్య‌దేవ్‌.. కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.

సాంకేతిక‌త‌

స్పేస్ థ్రిల్ల‌ర్ ఇది. ఇలాంటి క‌థ‌లు దేశం మొత్తమ్మీద ఒక‌టో రెండో వ‌చ్చాయి. రిఫ‌రెన్స్‌లు త‌క్కువ ఉన్నా, టెక్నిక‌ల్ టీమ్ మాత్రం బాగా క‌ష్ట‌ప‌డి, త‌మ మార్క్ ని చూపించే ప్ర‌య‌త్నం చేసింది. బ‌డ్జెట్ ప‌రిమితులు, ప‌రిధులు క‌నిపించాయి. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంది. పాట‌ల‌కు స్కోప్ లేదు. ద‌ర్శ‌కుడిగా.. సంక‌ల్ప్‌రెడ్డి మ‌రో విభిన్న ప్ర‌య‌త్నం చేశాడు. అది ఎంత వ‌ర‌కూ ప్రేక్ష‌కుల‌కు చేరువ అవుతుంద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. ఈ ప్ర‌య‌త్నం, అందుకోసం ప‌డిన క‌ష్టం అభినంద‌నీయం.

మొత్తానికి..

క‌ష్ట‌ప‌డ్డారు క‌దా అని ప్ర‌తీ సినిమానీ గొప్ప‌గా చూడ‌లేం. ఈ సినిమాలోనూ వెదికితే బోలెడు లోపాలు క‌నిపిస్తాయి. కాక‌పోతే.. అంతరిక్షంలో ఓ క‌థ చెప్పాల‌న్న ఆలోచ‌న‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. మ‌నం కూడా ఇలాంటి సినిమాలు తీయ‌గ‌లం అని చెప్పుకోవ‌డాని అంత‌రిక్షం ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది.

leave a reply