అమ్మలగన్న అమ్మ ‘భీమవరం మావుళ్లమ్మ’

భీమవరం మావుళ్ళమ్మ విజయవాడ కనకదుర్గ తరువాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత. తొమ్మిది దశాబ్దాల క్రిందట భీమవరం అనే కుగ్రామమంలో వెలసిన అమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతూ ఉంది. ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు.

అమ్మలగన్న అమ్మగా, కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లిగా భీమవరం గ్రామ దేవత శ్రీమావుళ్లమ్మ తల్లి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారి దైవంగా ప్రసిద్ధి. అమ్మ సన్నిధికి వచ్చి తమ బాధలను చెప్పుకుని ఆర్తితో వేడుకుంటే చాలు.. చిటికెలో సమస్యలన్నీ దూరమవుతాయని భక్తుల విశ్వాసం.  అందుకే సామాన్య భక్తుడి నుంచి సంపన్నుడి వరకు నిత్యం అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. అంతటి మహిమ గల మూర్తి పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువై ఉంది. వ్యాపారం ప్రారంభించినా, వివాహాదివేడుకలు చేస్తున్నా, నూతన వాహనాలు కొన్నా, అంతా శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దయ అని చెప్పుకుంటారు స్థానికులు.

చరిత్ర ప్రకారం.. 1880 వైశాఖ మాసం రోజులల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతాన్ని గురించి చెపుతూ ఇక్కడే తనకు ఆలయం నిర్మించాలని కోరినది. మరుసటి రోజున వారిరువురు ఆప్రాంతానికి వెదుకగా అమ్మవారి విగ్రహం లభ్యమయినది. మామిడితోటలో వెలసిన అమ్మవారిని తొలినాళ్ళలో ‘మామిళ్ళమ్మ’గా తదనంతరం ‘మావుళ్ళమ్మ’గా పిలవటం అలవాటయ్యింది.

ఈ ఆలయం మొక్క ప్రత్యేకతలు.. ఈ క్షేత్రంలో ప్రతి నిత్యం పులిహోరను ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు. జ్యేష్టమాసంలో నెల రోజులు గ్రామ జాతర, నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు. ప్రతి రోజు లక్ష కుంకుమార్చన, చండీ హోమం ఇతర పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడు జనవరి 13 సంక్రాంతికి దేవస్థానం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతారు. ఉత్సవాల చివరి 8 రోజులలో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు. చివరిరోజున వేలాదిమంది భక్తులకు అన్నదాన కార్యక్రమము జరుగుతుంది.

leave a reply