కాంట్రాక్టు ఉద్యోగులను మోసం చేస్తున్న ప్రభుత్వం..

మంత్రి వర్గ నిర్ణయాలకు భిన్నంగా మెమోలా!: కాంట్రాక్టు లెక్చరర్లు ఆగ్రహం

ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్‌ ఆఫ్‌ టైమ్‌ స్కేలు(ఎంటీఎస్‌) వర్తింపజేస్తూ ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులు(జీవో-12), తాజాగా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఇచ్చిన మెమోలపై ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్స్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు.. డీఏతో కూడిన మినిమమ్‌ టైమ్‌ స్కేలు, ఏటా 10 రోజుల బ్రేక్‌తో 12 నెలల జీతం, 60 ఏళ్ల వరకు కొనసాగిస్తూ ఉద్యోగ భద్రత, 180 రోజుల ప్రసూతి సెలవు ఇచ్చేలా.. గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌(జీవోఎం)లో నిర్ణయం తీసుకుని.. ఇప్పుడు దీనికి విరుద్ధంగా ఉత్తర్వులు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్తర్వులు, మెమోల్లో ఏ మాత్రం స్పష్టత లేదని విమర్శిస్తున్నారు. మినిమమ్‌ టైమ్‌ స్కేలు ఇవ్వాలని జీవోఎం ప్రభుత్వానికి సిఫారసు చేసిందని స్వయంగా మంత్రి వర్యులే ప్రకటించారని.. అలాగైతే జూనియర్‌ కాలేజీ లెక్చరర్స్‌కు రూ.37,100, డిగ్రీ/పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌కు రూ.42,030 బేసిక్‌ పే ఇవ్వాల్సి ఉందని అంటున్నారు.

కానీ, ఇప్పుడిచ్చిన ఉత్తర్వుల్లో మినిమమ్‌ ఆఫ్‌ టైమ్‌ స్కేలు అని చెప్పడం, అందులో ఎలాంటి అలవెన్స్‌లు, ఇంక్రిమెంట్లు ఇవ్వమని పేర్కొనడం, కరువు భత్యం(డీఏ) విషయాన్ని ప్రస్తావించకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి నుంచీ తమకు ఉద్యోగ భద్రత, 60 ఏళ్ల వరకు సర్వీసు కొనసాగిస్తామని చెప్పి.. ఇప్పుడు పెర్ఫార్మెన్స్‌, అందుబాటులో ఉన్న ఖాళీలను, అవసరాన్ని బట్టి.. అంటూ వివిధ రకరకాల షరతులు విధించడం ఎంతవరకు సమంజసమని వారు ఆంధోళన చెందుతున్నారు. 12 నెలలు ఇస్తామని అప్పుడు చెప్పి, ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం అనడం సరికాదంటున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా జీవోఎం తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్‌ ఆమోదించిన అంశాలను అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వర్యులు గంటా శ్రీనివాసరావు తమకు హామీ ఇచ్చినా ఆ మేరకు ఉత్తర్వులు, మెమోలు ఇవ్వలేదని తెలిపారు. చివరిగా ఇప్పటికైనా ఉత్తర్వులు, మెమోల్లో మార్పులు చేసి తమకు న్యాయం చేయాలని ఏపీ కాంట్రాక్టు లెక్చరర్స్‌ జేఏసీ కన్వీనర్‌ వై. రాజాచౌదరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీని మీద ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

leave a reply