కియా… క్రెడిట్ కొట్టేయాలని నానా తంటాలు

ఆంధ్రాలో అతిపెద్ద కార్ల కంపెనీ ఏర్పాటు చేసి తెలుగు వారి కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడం ఏమో కానీ, బీజేపీ నేతలకు మాత్రం కంటి మీద కునుకు ఉండటం లేదు. కియా సంస్థ త‌యారు చేసిన తొలికారులో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌యాణం చేశారు. అయితే, ఇది కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఘ‌న‌త అంటూ మ‌ళ్లీ మీడియా ముందుకు వ‌చ్చారు భాజ‌పా ఎంపీ జీవీఎల్ న‌ర్సింహ‌రావు.

కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌మేయంతో చొర‌వ‌తో చేస్తున్న‌ ప‌నుల‌న్నీ త‌మ‌విగా చాటుకోవ‌డం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి అల‌వాటు అయిపోయింద‌ని విమ‌ర్శిస్తూ.. త‌న‌కు సంబంధం లేని విష‌యాల‌ను కూడా త‌మవిగా చెప్పుకోవ‌డం తండ్రీకొడుకుల‌తోపాటు, ప్ర‌భుత్వంలోని మంత్రుల‌కూ అల‌వాటైపోయింద‌న్నారు.

అంతేకాక, కియా మోటార్స్ తో ఈ రాష్ట్ర ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌న్నారు జీవీఎల్‌. దీన్ని తీసుకొచ్చింది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అనీ, మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న తెచ్చార‌న్నారు. ఆ త‌రువాత‌, భాజ‌పా మంత్రుల చొర‌వ‌తో ఈ ప‌రిశ్ర‌మ రాష్ట్రానికి వ‌చ్చింద‌న్నారు. అంతేకాదు, ఆంధ్రాకు సానుకూలంగా ఉండే విధంగానే సంబంధిత శాఖ‌లో మంత్రుల‌ను మోడీ నియ‌మించార‌న్నారు.

ప్ర‌ధాన‌మంత్రి అంత చొర‌వ తీసుకున్నారు కాబ‌ట్టే, రాష్ట్రానికి కొన్ని ప్రాజెక్టులు రావ‌డానికి కార‌ణ‌మైంద‌న్నారు. కియా ఆంధ్రాకు ఏవిధంగా వ‌చ్చింద‌నేది జీవీఎల్ న‌ర్సింహారావుకు ఏమాత్రం అవ‌గాహ‌న లేదు. నిజానికి, ఇది ఆంధ్రాకి నేరుగా వ‌చ్చిన ప్రాజెక్ట్ కాదు. మొద‌ట్లో త‌మిళ‌నాడులో కియా మోటార్స్ ను పెట్టాల‌ని అనుకున్నారు. అక్క‌డి ప్ర‌భుత్వంతో కియా మోటార్స్ ఒప్పందాలు కూడా చేసేసుకుంది.

అయితే, ప‌నులు ప్రారంభానికి ముందు.. అక్క‌డి రాజకీయ నాయ‌కులు అడిగిన లంచాలు చూసి ఆ సంస్థ బెంబేలెత్తిపోయింది. ఆ మాట‌ను కియా సంస్థ ప్ర‌తినిధులే స్వ‌యంగా ప్ర‌క‌టించిన విషయం కూడా తెలిసిందే. ఆ త‌రువాత‌, కియాను గుజ‌రాత్ లేదా ఆంధ్రాలో పెట్టాల‌ని ఆ సంస్థే భావించింది. అప్ప‌టికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రా ముందంజ‌లో ఉండ‌టం, హైద‌రాబాద్ ను అభివృద్ధి చేసిన‌ చంద్ర‌బాబు నాయుడు ట్రాక్ రికార్డ్‌, న‌వ్యాంధ్ర‌లో అభివృద్ధికి ఆయ‌న చూపిస్తున్న చొర‌వ‌, పార‌ద‌ర్శ‌క ప్ర‌భుత్వ విధానాలు.. ఇవ‌న్నీ ప్ల‌స్ అయ్యాయి.

 త‌మిళ‌నాడు నుంచి కియా వేరే రాష్ట్రాల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలియ‌గానే సీఎం చంద్ర‌బాబు కూడా మంత‌నాలు ప్రారంభించారు. ఆయన చూపిన చొరవ ఫలితం వచ్చి ఆంధ్రాకి కియా వ‌చ్చింది.

అంతేగానీ… ఇప్పుడు జీవీఎల్ చెబుతున్న‌ట్టుగా భాజ‌పా స‌ర్కారు కృషి ఏమాత్రం లేద‌నేది వాస్త‌వం. ఇప్పుడు ప‌రిశ్ర‌మ ప్రారంభ‌మై, ఉత్ప‌త్తి ప్రారంభించాక‌.. ఇది మోడీ ఘ‌న‌తే అని ఏపీ భాజ‌పా నేత‌లు చెప్పుకోవ‌డం విచార‌క‌రమని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.

leave a reply