మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే అవినీతి నేతల ఆటలు సాగవని మోదీ అన్నారు. ఏపీ ప్రజల చిరకాల కోరిక రైల్వోజోన్‌ను ఏర్పాటు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.దీంతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందన్నారు.విశాఖను చూస్తుంటే తన మనసు పులకిస్తోందని ప్రధాని చెప్పారు.ఉత్తరాంధ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.
ఇక్కడి నేతలు ఎలాంటివారితో జట్టు కడుతున్నారో ప్రజలు గమనించాలని చంద్రబాబు-రాహుల్ గాంధీల గురించి పరోక్ష విమర్శ చేశారు.ఇక్కడ నేతల మాటలు దారుణంగా ఉన్నాయని, వాళ్లు పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ నేతల వ్యాఖ్యలతో సైనికుల స్థైర్యం దెబ్బతింటుందని.. దేశాన్ని కించపరిచే నేతల విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మోదీ సూచించారు. ఆత్మగౌరవం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు వారి ఆటలు సాగనివ్వం అని తెలిపారు. దురుద్దేశాలతో రాజకీయాలు చేసేవాళ్లే భయపడతారు,మాకు ఎలాంటి భయాలు, ఆందోళనలు లేవు అని మోడీ విమర్శలు గుప్పించారు.