రాష్ట్రానికి వచ్చి పరువు పోగొట్టుకుంటున్న బీజేపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభం అంటూ బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా రాష్ట్రానికి వ‌చ్చారు. శ్రీ‌కాకుళం జిల్లా ప‌లాసలో బ‌స్సు యాత్ర మొద‌లుపెట్టారు. ఇత‌ర రాష్ట్రాల్లో మాదిరిగానే భారీగా జ‌నాల్ని త‌ర‌లించేసి, ప‌లాస స‌భ‌ను సూప‌ర్ హిట్ అనిపించుకుని… దేశంలో చ‌ర్చ‌నీయాంశం చేద్దాం అనుకున్నారు. కానీ, ఇక్క‌డి ప‌రిస్థితి మ‌రోలా ఉంది. ప‌లాస‌లో ఏర్పాటు చేసిన స‌భ‌కు జ‌నాలు అనుకున్నంత‌గా రాలేదు. దాంతో స‌భ ర‌ద్దు చేసుకుని.. బ‌స్సు యాత్ర ప్రారంభించేసి, బ‌స్సు మీద నుంచే అమిత్ షా ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన కీల‌క వ్యాఖ్య ఏంటంటే… ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి ఎన్డీయే త‌లుపులు శాశ్వ‌తంగా మూసుకున్నాయ‌ని, ఆయ‌న తిరిగి వ‌స్తామ‌న్నా చేర్చుకునే ప‌రిస్థితి లేద‌ని అన్నారు. ఎన్డీయేతో పొత్తు పెట్టుకునే అవ‌కాశాన్ని భ‌విష్య‌త్తులో లేకుండా ఆయన చేసుకున్న విష‌యాన్ని ఏపీ ప్ర‌జ‌లు గుర్తించాల‌న్నారు. దేశంలో మ‌రోసారి మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నీ, ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత మ‌రోసారి ఎన్డీయేతో జ‌తక‌ట్టేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తార‌నీ, అది సాధ్యం కాద‌న్నారు.

ఇక‌, ఏపీకి కేంద్రం ఏం చేశారనేది రాష్ట్ర నేత‌లు నిత్యం చెబుతున్న అంశాల‌నే అమిత్ షా కూడా చెప్పారు. ముఖ్యంగా, చంద్ర‌బాబుకి ఎన్డీయేతో త‌లుపులు శాశ్వ‌తంగా మూసుకున్నాయి అని చెప్ప‌డం వెన‌క షా ఉద్దేశం ఏంటంటే… ప్ర‌జ‌ల‌ను ప‌రోక్షంగా హెచ్చ‌రించిన‌ట్టే..! వారి ఆధిపత్య ధోరణిని ప్రదర్శించినట్టే. కేంద్రంలో మ‌ళ్లీ తామే ఉంటామ‌ని, రాష్ట్రానికి మేలు జ‌ర‌గాలంటే త‌మ ద‌యా దాక్షిణ్యాలు త‌ప్ప‌నిస‌రి అనే అర్థం వ‌చ్చేలానే ఆయ‌న వ్యాఖ్య‌లున్నాయి. ఏపీ కష్టాలను సానుభూతితో చూసే ప్రయత్నం చెయ్యలేదు.

ఈ రోజు ఆంధ్రాలో అమిత్ షా అడుగుపెడితే… బ‌స్సు యాత్ర‌ను అడ్డుకుంటూ, మోడీ గో బ్యాక్ అంటూ చాలామంది నిన‌దించారు. జాతీయ స్థాయికి వ‌చ్చేస‌రికి… ఏపీలో ఈరోజు అమిత్ షాకి ఎదురైన అనుభ‌వం, బీజేపీ స‌భ‌కు వ‌చ్చిన స్పంద‌న చ‌ర్చ‌నీయాంశం అవుతుంది. మోడీ స‌ర్కారుకుని దేశ‌వ్యాప్తంగా ఉన్న వ్య‌తిరేక ప‌వ‌నాల‌కు ఏపీ బ‌స్సుయాత్ర అద్దం ప‌ట్టే అవ‌కాశాలున్నాయి. నిజానికి, ఎన్డీయేపై ఉన్న ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తిని మొట్ట‌మొద‌టి సారిగా బ‌య‌ట‌ప‌డి విమ‌ర్శలు ప్రారంభించిందే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఆ త‌రువాత‌, ఒక్కో పార్టీగా మోడీ పాల‌న‌పై ధైర్యంగా గ‌ళం విప్ప‌డం ప్రారంభించాయి.

ఓర‌కంగా మోడీ పాల‌న‌పై వ్య‌తిరేక‌త‌ను తొలిసారిగా ధైర్యంగా వేలెత్తి చూపిందే తెలుగుదేశం ప్ర‌భుత్వం. ఇవాళ్ల‌, ఆంధ్రాలో బ‌స్సు యాత్ర ద్వారా ఆ వ్య‌తిరేక‌త ఏ స్థాయిలో ఉంద‌నేది దేశ‌వ్యాప్తంగా మ‌రోసారి బీజేపీనే ఈ అనుభ‌వాల ద్వారా చాటి చెప్పుకుంటున్న‌ట్టుగా ఉంది! తీవ్రమైన వ్యతిరేక ఉందని తెలిసీ, దిద్దుబాటు చర్యలు మానేసి.. ఇలా యాత్రలు మొదలుపెట్టడం వెనక వారి ఉద్దేశం ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానిలో ఏపీ పట్ల భాజపాకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది అర్థమౌతూనే ఉంది.

leave a reply