స్వతంత్రులు గెలుస్తారు.. హంగ్ ప్రసక్తే లేదు..!

జనం నాడి దొరకట్లేదన్న లగడపాటి

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి కి ఎన్నికల ఫలితాలను ఊహించడంలో చాలా మంచి పేరుంది. తెలంగాణ ఎన్నికలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. ఈసారి బరిలో నిలబడ్డ వారి లో చాలామంది ఇండిపెండెంట్లు గెలుస్తారని ఆయన చెప్పడంతో పెద్ద పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది.

దాదాపు ఎనిమిది నుంచి పది సీట్ల దాకా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుచుకుంటారని లగడపాటి చెప్పడంతో ఆ లెక్కన ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేశారు. అయితే ఒక టీవీ డిబేట్ లో పాల్గొన్న లగడపాటి హంగ్ అసెంబ్లీ వచ్చే ముచ్చట లేదు అంటూ స్పష్టతనిచ్చారు. 8 నుంచి 10 సీట్లు దాకా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందినప్పటికీ, ఆ స్వతంత్ర అభ్యర్థుల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపే అవసరం పడదని ఆయన స్పష్టం చేశారు. స్పష్టమైన మెజారిటీ తోనే ప్రభుత్వం ఏర్పడుతుందని లగడపాటి చెప్పినప్పటికీ అది టిఆర్ఎస్ ప్రభుత్వమా ప్రజా కూటమి ప్రభుత్వమా అన్నది మాత్రం సస్పెన్స్ లోనే ఉంచారు.

స్వతంత్ర అభ్యర్థుల గురించి లగడపాటి ప్రకటించగానే, ఇటు కేసిఆర్ కూడా ఆ ప్రకటనపై ప్రతిస్పందించారు. తెలంగాణ రాకూడదు అని శాపనార్థాలు పెట్టిన వ్యక్తి చేస్తున్న సర్వే ఇది అంటూ లగడపాటిపై తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేశారు. అలాగే సర్వేలపై లగడపాటి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అంటూ ఎలక్షన్ కమిషన్ కి టిఆర్ఎస్ ఫిర్యాదు కూడా చేసింది.

అయితే, తన సర్వే గురించి మరింతగా విపులీకరించడానికి ఆయన ఒక ఛానల్ టీవీ డిబేట్ లో మాట్లాడుతూ.. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందన్న విషయాన్ని తాను ఇప్పుడే చెప్పలేనని, డిసెంబర్‌ 7న పోలింగ్‌ ముగిసిన తర్వాత వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. అయితే, తెలంగాణలో ఎక్కువ 8 నుంచి 10 మంది వరకు స్వతంత్రులు గెలుస్తున్నట్లు తేలినా, 10 సీట్లు (స్వతంత్రులకు) పోయినా పార్టీలకు, ఇంకా 109 సీట్లు ఉంటాయని వాటిలో చూసుకోవచ్చు అని లగడపాటి వ్యాఖ్యానించారు. ప్రజల నాడి ఈసారి తమ బృందానికి అంత సులువుగా దొరకట్లేదు అని లగడపాటి అంగీకరించారు. దాదాపు ఆగస్టు నెల నుంచి తాము ఈ సర్వే చేస్తున్నామని, రాబోయే వారం రోజులపాటు కూడా ఇది కొనసాగుతుందని ఆయన అన్నారు.

ఏది ఏమైనప్పటికీ, ‘హంగ్‌ అసెంబ్లీ’ అనే ముచ్చటే లేదు అని, ఇండిపెండెంట్లు ఇచ్చే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావు అని, ప్రజా కూటమిగానీ, టిఆర్ఎస్ పార్టీ గానీ స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అని, లగడపాటి వ్యాఖ్యానించారు.అలాగే తాను నిన్న ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల విషయంలో, చాలామంది ఫోన్ చేసి తను చెప్పింది కరెక్టే నని అంటున్నారని, ఇద్దరిలో కనీసం ఒక్కరయినా కచ్చితంగా గెలుస్తారని అందరూ ఒప్పుకుంటున్నారని, ఏ ఒక్కరు కూడా ఆ ఇద్దరు ఓడిపోతారని చెప్పలేదని లగడపాటి వ్యాఖ్యానించారు.

అయితే, లగడపాటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. లగడపాటి చెప్పినట్లు, ఒక 8 -9 సీట్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్లిపోయినా, మిగిలిన వాటిలో ఇంకొక 10- 11 సీట్లు దాకా బిజెపి ఎమ్ఐఎమ్ లాంటి ఇతర పార్టీలకు వెళ్లిపోయినా, మొత్తం 119 స్థానాలలో ఇంకా వంద స్థానాలు మిగిలే ఉంటాయి. లగడపాటి చెప్పినట్లు, హంగ్ ఏర్పడకుండా స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే, ఈ వంద స్థానాలలో టిఆర్ఎస్ కానీ ప్రజా కూటమి కానీ ఒకరు 60 లేదా అంతకంటే ఎక్కువ స్థానాలు సాధించి అవతలి పక్షానికి 40 లేదా అంతకంటే తక్కువ సీట్లు రావాలి. టిఆర్ఎస్ లేదా ప్రజా కూటమిలో ఎవరికి అంత అవకాశం ఉంది అనేది వారం రోజుల్లో తేలిపోతుంది. మరి ఈసారి కూడా లగడపాటి సర్వే ఫలితాలు నిజమవుతాయా, లేకపోతే మొదటి సారి గా లగడపాటి సర్వేలకు దెబ్బ తగులుతుంది అన్నది తెలియాలంటే మరో పది రోజులు ఆగాలి.

leave a reply