జీమెయిల్‌తో… అసౌకర్యం!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు జీమెయిల్‌కు ఉన్నారు. వ్యక్తులు, సంస్థలు నిత్యం సమాచార మార్పిడికి జీమెయిల్‌ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అటువంటి జీమెయిల్‌ ఒక్కసారిగా పనిచేయకుండా ఆగిపోతే ఎంతోమందికి తీవ్ర అసౌకర్యానికి గురవుతారు.  ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. మంగళవారం సాయంత్రం అదే జరిగింది. యూరప్‌, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, భారత్‌తో సహా ఆసియాలోని పలు దేశాలలో సాయంత్రం 4.46 గంటల సమయంలో జీమెయిల్‌ పనిచేయడం ఆగిపోయింది.

 జీమెయిల్‌తోపాటు గూగుల్‌ క్యాలెండర్‌, గూగుల్‌ వాల్ట్‌, గూగుల్‌ ఫామ్స్‌, హ్యాంగవుట్స్‌ వంటి ఇతర సేవలకు కూడా అంతరాయం కలిగింది. జీమెయిల్‌ నిలిచిపోవడంతో చాలా దేశాలలో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. 45 శాతం మందికి జీమెయిల్‌ సైట్‌ అందుబాటులోకి రాలేదు. 25 శాతం మందికి లాగిన్‌ సమస్యలు ఏర్పడ్డాయి. మరో 22 శాతం మందికి జీమెయిల్‌ ఓపెన్‌ కాలేదు. ఈ సమస్యను వెంటనే జీమెయిల్‌ వాడకందారులు గూగుల్‌ దృష్టికి తీసుకువచ్చారు.

 అనంతరం సాంకేతిక సమస్యలను సరిచేసి దశలవారీగా జీమెయిల్‌ సేవలను పునరుద్ధరించడం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు గూగుల్‌ జి సూట్‌ సేవల డ్యాష్‌ బోర్డులో తాజా పరిస్థితిని గూగుల్‌ సంస్థ తెలియచేస్తూ వచ్చింది. చివరకు భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.20 గంటల సమయంలో అత్యధికులకు జీమెయిల్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జీమెయిల్‌ సేవలు ఆగిపోయిన గంట వ్యవధిలో ఎక్కువమందికి 404 ఎర్రర్‌ అని స్ర్కీన్‌పై కనిపించింది. అన్ని దేశాలలో జీమెయిల్‌ సేవలను అందరికీ అందుబాటులోకి తిరిగి తెచ్చేందుకై గూగుల్‌ సంస్థ నిపుణులు కృషి కొనసాగించారు.

leave a reply