ధర్మపోరాట దీక్షతో.. వారు మోడీ బీ అని తెలిపోయిందా..?

ప్రజల వద్ద.. ప్రజల కోసం.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగాన రాజకీయాల్లోఓ స్పష్టమైన విధానం ఉండి తీరాల్సిందే. అందులోను ముఖ్యంగా కీలకమైన అంశాల్లో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటే.. అటూ ఇటూ కాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ విషయంలో అలానే టీడీపీ ఎటూ తేల్చుకోకుండా మొత్తానికే అక్కడ ఆ పార్టీని కోల్పోయింది.

కానీ.. పెద్దగా క్లిష్టమైన సమస్య కాని కేంద్రంపై పోరాటం విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతే అది చేతకాని రాజకీయమే అవుతుంది. అదే పరిస్థితి ఏపీలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు వస్తుంది. నిజంగా ఏపీకి మోడీ అన్యాయం చేశారని వారు అనుకుంటే.. మోడీ పర్యటనపై వారు కచ్చితంగా స్పందించి ఉండేవారు. ఏపీకి అన్యాయం జరిగిందంటారు కానీ, ఏపీకి మోడీ వస్తే ఉలుకూ పలుకూ లేకుండా ఎక్కడ ఉన్నారో కనిపించకుండా ఉండడంతో వారిపై ఏపీ ప్రజలకు నమ్మకం పోయినట్లు ఉంది.

ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ విషయంలో మరో మాట లేదు. కానీ వారిద్దరూ… మోడీ అన్యాయం చేశారని నేరుగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడే వస్తోంది అసలు సమస్య. అలాంటప్పుడు.. కచ్చితంగా మోడీ అన్యాయం చేయలేదని. ఎదురుదాడి ప్రారంభించాలి.

కానీ, జగన్, పవన్‌లు అలా చేయకుండా మోడీ మోసం చేశారని చెప్పుకొస్తూ ఆయనపై పోరాటం చేసి చిత్తశుద్ధిని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితుల్లో.. సైలెంట్‌గా ఉండి పోవడంతో నిజంగా ప్రజాసమస్యలపై పోరాడే చిత్తశుద్ధి వారికి లేదన్న విషయంలో తటస్థుల్లో క్లారిటీ వచ్చేసినట్లయింది.

రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనది తటస్థుల ఓట్లే. మద్దతు దారులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వారిని కాపాడుకుంటూనే తటస్థుల ఓట్లు పొందడం అత్యంత అవసరం. అయితే, తటస్థులు ఇలా దాక్కునే రాజకీయాలు చేసే వారికి ఎప్పుడూ ఓట్లేయరు.

నాలుగేళ్ల పాటు చంద్రబాబు బీజేపీతో సంసారం చేశారు.. ఇప్పుడే పోరాడుతున్నారని వైసీపీ, జనసేన కామన్‌గా ఓ వాయిస్ వినిపిస్తుంటాయి. కానీ, ఓట్లు వేయడానికి చరిత్ర ఎవరూ చూడరు. ఇప్పుడేం జరుగుతుంది..? భవిష్యత్‌లో ఏం జరుగుతుంది..? ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుందనే విషయాలు మాత్రమే గమనిస్తారు. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో ఉన్న మాట నిజమే. ఆ పార్టీతో ఏమి కావడం లేదనే కదా.. బయటకు వచ్చింది. మరి చంద్రబాబు.. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు.. ఆ పార్టీపై పోరాడి.. టీడీపీ బయటకు రాగానే.. ఎందుకు సైలెంటయ్యారు…? ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి కదా..! వైసీపీ, జనసేన రెండూ.. బీజేపీకి బీ టీంగా ఇప్పుడు ప్రత్యేకంగా టీడీపీ ప్రచారం చేయాల్సిన పని లేదు. రేపు విభజన హామీలే ఎజెండాగా ఓటింగ్ జరిగితే… అసలు ఇవ్వనే ఇవ్వబోమంటున్న బీజేపీకి.. వారి బీటీంగా ముద్ర పడిన వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారనే చిన్న లాజిక్‌ను జగన్, పవన్ ఎలా మిస్సయ్యారో అర్ధం కావట్లేదు.

leave a reply