ఆసక్తి రేపుతున్న ఆండ్రాయిడ్ క్యూ

ఇప్పటికీ చాలా ఫోన్లలో ఆండ్రాయిడ్‌ పై ఆపరేటింగ్‌ సిస్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానే లేదు. అప్పుడే గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ 10 (ఆండ్రాయిడ్‌ క్యూ) ఆపరేటింగ్‌ సిస్టం డెవలపర్‌ బిల్డ్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గూగుల్‌ పిక్సెల్‌ వంటి ఫోన్లకి వెంటనే, వన్‌ప్లస్‌, ఎసెన్షియల్‌ వంటి ఫోన్లకి ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. మొబైల్‌ ప్రియుల్లో క్యూరియాసిటీని పెంచుతున్న ఆండ్రాయిడ్‌ క్యూ విశేషాలు.

ఇప్పటికే ఆండ్రాయిడ్‌ పైలో డార్క్‌మోడ్‌ ఉంది. పరోక్షంగా ఫోన్‌ బ్యాటరీని ఆదా చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతానికి ఇది సిస్టం సెట్టింగ్స్‌, నోటిఫికేషన్‌ ఏరియా వంటి ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కి సంబంధించిన ప్రదేశాల్లో మాత్రమే డార్క్‌బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండే విధంగా వెసులుబాటు కల్పిస్తుంది. అయితే ఆండ్రాయిడ్‌ క్యూలో, అందుకు భిన్నంగా అన్ని చోట్లా సిస్టమ్‌ వైడ్‌ డార్క్‌మోడ్‌ ఉండేలా ఏర్పాటు చేయబడుతోంది. వాస్తవానికి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌ డార్క్‌మోడ్‌ని ప్రవేశపెడుతున్నపటికీ, మన ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకుని అన్ని రకాల యాప్స్‌ దీన్ని కలిగి ఉండే అవకాశం లేదు కాబట్టి, ఆండ్రాయిడ్‌ క్యూలో వాటిని కూడా బలవంతంగా డార్క్‌ మోడ్‌లోకి మార్చే ఏర్పాటు చేయబడుతుంది. తద్వారా ఒక్కసారి డార్క్‌ మోడ్‌ ఎంపిక చేసుకుంటే, ఇక అన్ని చోట్ల ఫోన్‌ బ్లాక్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో తెలుపు అక్షరాలలో కనిపిస్తుంది.

డెస్క్‌టాప్‌ మోడ్‌!
చాలామందికి శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9 వంటి ఫోన్లలో ఉండే డెక్స్‌ అనే ప్రత్యేకమైన ఏర్పాటు గురించి తెలిసే ఉంటుంది. ఒక యుఎస్‌బి టైప్‌ – సి టు హెడ్‌డిఎంఐ కేబుల్‌ ద్వారా మీ ఫోన్‌ని ఏదైనా మోనిటర్‌కి కనెక్ట్‌ చేసినప్పుడు పూర్తిస్థాయి ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం మన మానిటర్‌ మీద ప్రత్యక్షమవుతుంది. అయితే శాంసంగ్‌ వంటి సంస్థలు ఇలా తమకు తాము కొన్ని మోడళ్ల మీద ప్రవేశపెట్టిన ఇలాంటి సదుపాయాన్ని ఇప్పుడు గూగుల్‌ సంస్థ కూడా ఆండ్రాయిడ్‌ క్యూ ఆపరేటింగ్‌ సిస్టంలో మిగతా అన్ని ఫోన్లకీ పరిచయం చేయబోతోంది. అంటే ఇది వచ్చిన తర్వాత, మీ ఫోన్‌ తయారీ కంపెనీ ఒక ప్రత్యేకమైన డేటా కేబుల్‌ ద్వారా ఒక ఖాళీ మానిటర్‌కి మీ ఫోన్‌ని కనెక్ట్‌ చేసుకుంటే, పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్‌ డెస్క్‌టాప్‌ మీద వాడుకునే అవకాశం లభిస్తుంది.

అప్‌డేట్స్‌ వెంటనే..
మామూలుగా మన ఫోన్‌ అప్‌డేట్స్‌ని మన ఫోన్‌ తయారీ కంపెనీ అందించాల్సి ఉంటుంది. అంటే కంపెనీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. అయితే అధిక శాతం ఫోన్‌ తయారీ కంపెనీలు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ ఇవ్వడం విషయంలో అశ్రద్ధ వహిస్తూ ఉండటంతో, గూగుల్‌ సంస్థ ఆండ్రాయిడ్‌ క్యూలో అపెక్స్‌ (అప్లికేషన్‌ ఎక్స్‌ప్రెస్‌) అనే కొత్త విధానాన్ని ఆవిష్కరించబోతోంది. అంటే, ఇకపై ఫోన్‌ తయారీ కంపెనీ మీద ఆధారపడాల్సిన పనిలేకుండా, అతి కీలకమైన మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్‌లు, ఇతర అప్‌డేట్లను నేరుగా వినియోగ దారుల గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఎలాగైతే ఇతర అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకుంటారో అలానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ముఖ్యమైన అప్‌డేట్‌ లైబ్రరీ ఫైళ్లు ప్లే స్టోర్‌ ద్వారా అందుబాటులో ఉండే విధంగా గూగుల్‌ ఏర్పాటు చేస్తుంది.

మరింత మెరుగ్గా ఫేస్‌ అన్‌లాక్‌
ఇటీవలి కాలంలో చాలా ఫోన్లలో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ పక్కన పెట్టేసి, నేరుగా ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వాడబడుతోంది. వాస్తవానికి ఐఫోన్‌ ఎక్స్‌లో ప్రత్యేకమైన డాట్‌ ప్రొజెక్టర్‌, ఐఆర్‌ ఇల్యుమినేటర్స్‌, ఇతర హార్డ్‌వేర్‌ సెన్సార్ల ఆధారంగా, సెన్సార్‌ ఎదురుగా ఉన్నది నిజమైన మనిషా, లేదా ఫొటోనా అన్నది పరిశీలించబడి ఫోన్‌ లోపలికి వెళ్లడానికి యాక్సెస్‌ ఇవ్వబడుతుంది. అందుకే ఐఫోన్లలోకి బలవంతంగా లోపలకి చొరబడటం చాలా కష్టసాధ్యం.

ఎమర్జెన్సీ బటన్..
ఇప్పటికే ఇండియాలో విక్రయించబడుతున్న పలు ఫోన్లలో అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడే విధంగా ప్యానిక్‌ బటన్‌ లభిస్తున్నప్పటికీ.. ఆండ్రాయిడ్‌ క్యూలో పవర్‌ బటన్‌ ప్రెస్‌ చేసినప్పుడు ఎమర్జెన్సీ సర్వీసులకి నేరుగా డయల్‌ చేయడానికి ఆప్షన్లతో కూడిన ప్రత్యేకమైన ఆప్షన్ రాబోతోంది. ప్రమాదంలో ఉన్న మహిళలు,వ్యక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

5జి ఇండికేటర్..
2019 లో చాలా ఫోన్లలో 5జి సదుపాయం రాబోతున్న సమయంలో ఒకవేళ మన దగ్గర 5జి ఫోన్‌ ఉన్నా,మనం వాడుతున్న మొబైల్‌ నెట్‌వర్క్‌ 5జి కనెక్టివిటీని సపోర్ట్‌ చేసినప్పటికీ, దానికి సంబంధించిన ఇండికేటర్‌ మాత్రం ఇప్పటివరకు రెడీగా లేదు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్‌ క్యూలో 5జి, 5జి ప్లస్‌ అనే రెండు రకాల ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ ఇండికేటర్లు రాబోతున్నాయి.

స్క్రీన్ రికార్డర్..
స్క్రీన్ మీద జరుగుతున్నది ఉన్నది ఉన్నట్లు రికార్డు చేయడం కోసం చాలామంది గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి ప్రత్యేకమైన యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకుంటూ ఉంటారు. అయితే అలాంటి కొన్ని యాప్స్‌ మనకు తెలియకుండానే మన సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లకు చేరవేస్తున్న నేపధ్యంలో స్క్రీన్ రికార్డింగ్‌ సదుపాయాన్ని కూడా ఆపరేటింగ్‌ సిస్టంలోనే అంతర్భాగంగా కల్పించటం కోసం గూగుల్‌ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే, తరచూ వివిధ రకాల అవసరాల కోసం స్క్రీన్ ను రికార్డ్‌ చేసుకునేవారు ఇక ఇతర యాప్స్ ని వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

leave a reply