నాగబాబుపై ‘చిరు’ అలక

అన్నదమ్ములు అంటే ప్రేమలే కాదు కోపాలూ, కొట్టుకోవడాలు కూడా ఉంటాయన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఓ ఇంటర్వ్యూలో.. తముళ్ళపై మీరెప్పుడైనా కోపం తెచ్చుకున్నారా..? అనే ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి ఇలా సమాధానం ఇచ్చారు. నేను ఎక్కువగా నాగబాబుపై కోపం తెచ్చుకునేవాన్ని. చిన్నప్పుడు నేను చెప్పిన పనులు చేసేవాడు కాదు. ఎప్పుడూ నా వెనకాలే ఉండేవాడు. నా గురించిన విషయాలన్నీ మా అమ్మకు చెప్పేవాడు. పవన్‌కి నేనంటే చాలా ఇష్టం. అందుకే మేమిద్దరం ఓ జట్టుగా కలిసి ఉండేవాళ్లం.

ఒకసారి ఏమయిదంటే.. నేను అప్పుడు ఇంటర్మీడియట్‌ చదువుతున్నా.. నాగబాబు ఏడో తరగతి చదువుతున్నాడు అనుకుంట. నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మకు చిన్న లేదా పెద్ద పనుల్లో సహాయం అందిస్తూ ఉండేవాడిని. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకురావడంతో పాటు, మరో చోటుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. రెండూ ఒకే సమయంలో చేయాల్సి రావడంతో ‘నేను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా’ అని నాగబాబుకు చెప్పా. నేను పని చూసుకుని వచ్చి ‘బట్టలు తెచ్చావా?’ అని అడిగితే ‘తీసుకురాలేదు’ అన్నాడు. ‘ఎందుకు తేలేదు’ అని అడిగితే.. ‘నిద్ర పోతున్నా’ అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చి కొట్టేశాను. అది చూసి అమ్మకు నాపై అరిచేసింది ‘చిన్నోడిని అలా కొడతావా?’ అంటూ నన్ను బాగా తిట్టింది. నేను చెప్పినా వినపించుకోలేదు.

మరి నేను ఊరుకుంటానా.. నాన్న సాయంత్రం ఇంటిరాగానే ఏడుస్తూ జరిగిందంతా మొత్తం చెప్పేశా. అప్పుడు నాన్న వెళ్లి నాగబాబును బాగా తిట్టారు. అప్పుడు నాకు రిలీఫ్‌గా అనిపించింది’ అంటూ నవ్వుతూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్‌. ఇలాంటివి ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా చాలా నవ్వు వస్తూ ఉంటుందన్నారు. కాగా.. ఈ మధ్య వరుసగా నాగబాబు చేసిన ట్వీట్లు బాగా వైరల్‌ అయ్యాయి. బయోపిక్‌లపై మెగా బ్రదర్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే.

leave a reply