నా సర్వేలో తప్పు లేదు.. ఏదో జరిగింది..!

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం తాను చెప్పిన ఫలితాలు రాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన విజయవాడ పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గతంలో తన ఆర్జీ ఫ్లాష్ టీమ్ అంచనాలు ఎన్నడూ తప్పలేదని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తన అంచనాకు 2-3 సీట్ల తేడా మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తన సర్వే అంచనాలు తారుమారు అయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయమై తాను నెలరోజుల పాటు అధ్యయనం చేశాననీ, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశానని అన్నారు.

ఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో సమస్య ఉందని కొందరు, పోలింగ్ శాతం చెప్పడానికి ఒకటిన్నర రోజు పట్టిందని మరికొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేశారని లగడపాటి తెలిపారు. తెలంగాణలో ఎన్నడూ లేనివిధంగా ధన ప్రవాహం ఉంటుందని తాను ముందుగానే చెప్పానన్నారు.

తెలంగాణలో నిశ్శబ్ద ఓటు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని తాను భావించానన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈవీఎంలను లెక్కిస్తే ఈవీఎం కంటే వీవీప్యాట్ లో ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు వాయిదా వేసిందన్నారు. తెలంగాణ పంచాయితీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య చాలా తేడా ఉందన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాల బలం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం నేపథ్యంలో విపక్షాలు తుడిచిపెట్టుకుపోవాలని, కానీ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాలు దీటుగా నిలిచాయని అన్నారు. తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేయడానికి, ఎవరో నేతల ప్రోద్బలంతో తాను సర్వే ఫలితాలను విడుదల చేయలేదని స్పష్టం చేశారు. తాను స్వతంత్ర వ్యక్తిననీ, తనపై ఎవరి ఒత్తిడి లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఈ ఎలక్ట్రానిక్ యుగంలో పోలింగ్ శాతం ప్రకటించడానికి ఒకటిన్నర రోజులు ఎందుకు పట్టిందో ఎన్నికల సంఘం చెప్పాలని లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎక్కువ పోలింగ్ నమోదయినట్లు చెబుతున్నారనీ, అలాంటప్పుడు గంటగంటకు ఎంత పోలింగ్ నమోదయిందో చెప్పాలన్నారు. వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కిస్తే ఓటర్ల అనుమానాలు నివృత్తి అవుతాయని వ్యాఖ్యానించారు. తనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే తాను వివరణ ఇస్తున్నానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లగడపాటి మాట్లాడారు.

త్వరలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన సర్వేలను కూడా తాను విడుదల చేస్తానని లగడపాటి ప్రకటించారు. అప్పుడు ఫలితాలను బట్టి తెలంగాణలో తన సర్వే ఎందుకు తప్పిందో వివరణ ఇస్తానన్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయనీ, వాటికి తగ్గ సాక్ష్యాలు కూడా ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

తాను ఎవరి జోక్యం, ప్రోద్బలంతో సర్వేలు ఇవ్వలేదని తేల్చిచెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే 2009లో సొంత పార్టీపై తిరగబడ్డ వ్యక్తిని తానని లగడపాటి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. తాను ఎవరి కోసమో దొంగ సర్వేలు చేయించలేదని స్పష్టం చేశారు.

leave a reply