‘ఫస్ట్రేషన్‌’తో ఫన్‌ చేశారు..

‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) సినిమాతో మనముందుకు వచ్చేశారు వెంకీ, వరుణ్‌, తమ్మన్నా, మెహరీన్‌. ‘పటాస్‌, సుప్రీమ్‌, రాజాదిగ్రేట్‌’ వంటి సినిమాలతో డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తన టైమింగ్‌ కామెడీ టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నారు. అలాగే మన విక్టరీ వెంకటేష్‌ కామెడీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. మరి వీళ్లందరి క్రేజీ మల్లీస్టారర్‌ మూవీ నిజంగా క్రేజీ అనే చెప్పొచ్చు. ఇక ఈ మూవీని దిల్‌రాజు నిర్మించాగా.. డీఎస్పీ సంగీతం అందించారు. ట్రైలర్‌ చూస్తేనే ఈ సినిమా ఎప్పుడు చూడాలనిపించే విధంగా అందరినీ ఆకట్టుకుంది. కాగా ఈ సంక్రాంతికి ఫుల్‌గా నవ్వించడానికి ఈ చిత్రం మనముందుకు వచ్చేసింది. మరి ఈ సంక్రాంతి అల్లుళ్ళు పండక్కి ఎంత సందడి చేశారో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..!

కథేంటంటే..

వెంకీ ఓ ఎమ్మెల్యే దగ్గర పీఏగా వర్క్ చేస్తుంటాడు. వెంకీకి పెళ్లి చేసుకునే టైం వచ్చేస్తుంది. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందామనే క్రమంలో.. సెల్ఫ్ రస్పెక్ట్, మొగుడుపై పెత్తనం చేసే మనస్తత్వం ఉన్న తమన్నాతో వెంకీకి పెళ్లి అవుతుంది. మొదటి ఆరు నెలలు ఎంతో హ్యాపీగా వాళ్ల జీవితం సాగుతుంది. అయితే, సాధారణంగానే ఏ జంటలోనైనా చిన్న చిన్న ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి వీళ్ల జీవితంలోకి ఎంటర్‌ అవుతాయి. ఇక మన తమన్నా వెంకీపై తమ శైలిలో విరుచుకుపడటం, దాంతో వెంకీ వాళ్ల టార్చర్‌ భరించలేక ఆసనాలు వేసుకుంటూ.. తనలోనే తనూ కాంప్రమైజ్ అవ్వలేక నానా అవస్థలు పడుతుంటాడు.

అయితే ఈ ప్రాసెస్‌లోనే తమన్నా సిస్టర్ హానీ వరుణ్‌తో లవ్‌లో పడటం, వాళ్ల లవ్‌కి అందరూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు. కానీ వెంకీ మాత్రం వాళ్ల గురించి చెప్పినా వరుణ్‌ పట్టించుకోకుండా పెళ్లి చేసుకుంటాడు. ఇక అప్పటి నుంచీ తమన్నా ఫ్యామిలీ దెబ్బకి వరుణ్ కూడా భార్య బాధితుడిగా మారతాడు. దాంతో వెంకీ -వరుణ్ తమ భార్యలకు బుద్ధి చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం వారి జీవితాలనే మారుస్తుంది. అసలు వీళ్ళు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి ? దానికి వీళ్ళ పై తమన్నా,  మెహరీన్ ఎలా రివెంజ్ తీర్చుకున్నారు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

మన విక్టరీ వెంక‌టేష్ చాలా కాలం త‌ర్వాత త‌న స్థాయికి త‌గ్గ వినోదం అందించే పాత్ర‌లో క‌నిపించారు. పాత చిత్రాల్లో వెంక‌టేష్ ఎలా న‌వ్వించారో ఈ సినిమాలోనూ అలాగే న‌వ్వించారు. తన కామెడీతో థియేటర్‌లో నవ్వులు పువ్వులు పూయించారు. ఇద్దరు తోడళ్లుల్ల ఫ్ర‌స్ట్రేష‌న్ అనే క‌న్నా, వెంకీ ఫ్ర‌స్ట్రేష‌న్ అంటే బాగుంటుందేమో! ఎందుకంటే ఆయ‌న పాత్రే సినిమాలో హైలైట్‌. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడాడు. త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి క‌థానాయిక‌గా క‌నిపించింది. మెహ‌రీన్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు ఇలా ప్ర‌తి పాత్ర న‌వ్వించ‌డానికి ఉద్దేశించిందే! అన్న‌పూర్ణ‌, వై.విజ‌య జోడీగా క‌నిపించి న‌వ్వులు పంచారు.

ర‌చ‌యిత‌గా అనిల్‌రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. త‌న బ‌లం వినోద‌మే. దాన్ని సాధ్య‌మైనంత‌వ‌ర‌కూ ప్ర‌తి సీన్‌లో పండించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. కానీ, ఎఫ్‌2 చాలా చిన్న క‌థ‌. తొలి స‌న్నివేశాల్లోనే మ‌న‌కు అర్థ‌మైపోతుంది. ట్విస్టులు, హంగుల‌వైపు వెళ్ల‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒకేలా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. అయితే,  పాట‌లు అన్నీ ఆక‌ట్టుకోలేదు. యూర‌ప్‌లో తెర‌కెక్కించిన పాట మాత్రం బాగుంది. కెమెరా ప‌రంగా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉందీ సినిమా. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

చివరకు..

ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు కామెడీని ఇష్టపడే వాళ్లకు మాత్రం బాగా నచ్చుతుంది. సింపుల్‌ మూవీ అయినా కొత్తగా.. ప్రేక్షకుల హార్ట్‌కి టచ్‌ చేసే విధంగా ఉంది స్టోరీ. కాకాపోతే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.

leave a reply