నందమూరి బయోపిక్.. ఎక్కవ షోలకు అనుమతి

నవరస నటనా సార్వబౌముడు నందమూరి తారక రామారావు కథ ఆధారంగా తెరకెక్కు  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు స్పెషల్ షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జనవరి 9వ తేదీ నుంచి జనవరి 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో నందమూరి అభిమానులలో ఉత్సాహం నెలకొంది. ఈ సినిమా రిలీజ్ ని పండుగలా చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకు చెందిన వాళ్లు మొదటి రోజు మొదట ఆటను చూడాలని స్పెషల్ షోలకు బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా పార్టీ వారే ఉంటారని సోషల్ మీడియాలో అప్పుడే రచ్చ మొదలైంది.

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ ఎన్టీఆర్ బయోపిక్‌ను నందమూరి బాలకృష్ణ స్వయంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణే నటించారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో నాగేశ్వరరావు పాత్రలో హీరో సుమంత్, చంద్రబాబు పాత్రలో హీరో రానా, బసవతారకంగా విద్యాబాలన్, హరికృష్ణగా కళ్యాణ్ రామ్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు తదితరులు నటించారు.

సెన్సార్ బోర్డు కూడా ఈ చిత్రానికి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం 171 నిమిషాల నిడివితో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ జవవరి 9న విడుదలకు సిద్ధమైంది. కాగా ఎన్టీఆర్ బయోపిక్‌ను దర్శకుడు క్రిష్ రెండు భాగాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ’ఎన్టీఆర్ మహానాయకుడు’గా తెరకెక్కించారు.

leave a reply