అదరగొట్టిన టీమిండియా.. బోణి అదిరింది..!

భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో బోణీ కొట్టింది. కివీస్‌ నిర్దేశించిన 156 పరుగులు లక్ష్యాన్ని 34.5 ఓవర్లలోనే ఛేదించారు. కానీ, భోజన విరామం తర్వాత మైదానంలోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్‌ అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను తట్టుకోలేకపోయారు. ఫలితంగా మ్యాచ్‌ను 30 నిమిషాలు పాటు నిలిపి వేశారు. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించి టీమిండియాకు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ధావన్‌ అర్ధశతకం చేయడంతో ఛేదనలో టీమిండియా పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు.

భోజన విరామానికి ముందు దూకుడుగా ఆడిన టీమిండియా.. బ్రేక్‌ అనంతరం ఓపెనర్‌ వికెట్‌ కోల్పోయింది. పదో ఓవర్‌లో బ్రేస్‌వెల్‌ వేసిన రెండో బంతికి రోహిత్‌ శర్మ.. గప్తిల్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ తోడుగా ధావన్ రెచ్చిపోయి ఆడాడు. ఇద్దరూ కలిసి బౌండరీలు బాదారు. కివీస్‌ బౌలర్లతో ఆటాడుకున్నారు.

విరాట్‌- ధావన్‌ జోడీ కలిసి జట్టుకు 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధశతకం చేసేలా కనిపించాడు. అయితే, 29 ఓవర్లో కోహ్లీని లాకియా ఫెర్గూసన్‌‌ పెవిలియన్‌ చేర్చాడు. 29వ ఓవర్‌లో లాకియా వేసిన నాలుగో బంతిని ఆడిన కోహ్లీ(45).. లాథమ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

అయితే.. అప్పటికి టీమిండియా విజయానికి 20 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు(13)తో కలిసి ధావన్(75) స్కోరు బోర్డును పరుగులు పెట్టించి 24 పరుగుల అజేయ భాగస్వామ్యంతో టీమిండియాకు విజయాన్ని అందించారు. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

leave a reply