‘కొండగట్టు’ శ్రీ ఆంజనేయస్వామి

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం తెలంగాణాలో కరీంనగర్‌ నుంచి 35 కి.మీటర్లలో కలదు. స్వామి స్వయంభూగా వెలసిన క్షేత్రమిది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల విశ్వాసం.

చరిత్ర ప్రకారం.. సుమారు నాలుగు శతాబ్దాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ, ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింతచెట్టు కనబడగా, సేదతీరడనికై ఆ చెట్టు కింద నిద్రపోయాడు. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నాను. నాకు ఎండ, వాన, ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. సంజీవుడు ఉలిక్కిపడి లేచి, ఆవును వెతకగా, ‘శ్రీ ఆంజనేయుడు’ కంటపడ్డాడు. సార్థకనాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు ‘అంబా’ అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించగా, శంఖు చక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. ఆంజనేయస్వామి ముఖం, రెండు ముఖాలతో వేంచేసి ఉండటం ఈ క్షేత్రం మొక్క ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలసినట్లు లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయస్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము కృష్ణారావు దేశ్‌ముఖ్‌చే కట్టించబడింది. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీబేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది.

ఈ ఆలయం మొక్క ముఖ్య ప్రత్యేకతలు ఏంటంటే.. ఉగాది పండుగ రోజు స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. చైత్ర శుద్ధనవమి రోజు శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా ఆలయకమిటీ వారు నిర్వహిస్తారు. శ్రావణమాసంలో సప్తాహ ఉత్సవాలు, ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజులపాటు తిరుప్పావై, గోదారంగనాయకుల కల్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం గావిస్తారు. అలాగే మంగళవారం, శనివారం ప్రత్యేక ఆకు, వడ మాల పూజలు నిర్వహిస్తారు.

leave a reply