విజయంతో సిరీస్ గెలిచిన భారత్!

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో అదరగొడతారనుకున్న రోహిత్, ధావన్, ధోని ఒకరి తరవాత ఒకరు విఫలమవడంతో భారత్‌ 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంబటి రాయుడు 90, విజయ్ శంకర్ 45, హార్థిక్ పాండ్యా 45 పరుగులతో టీంఇండియా విజయంలో కీలక పాత్రను పోషించారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ కు షమీ ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు. టీమిండియా బౌలర్ల ధాటికి లక్ష్యఛేదనలో కివీస్‌ 217 పరుగులకే కుప్పకూలింది.

ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌(8), కొలిన్‌ మున్రోలు పెవిలియన్‌ బాట పట్టడంతో కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టుకు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్, కీపర్ టామ్ లాథమ్ అండగా నిలిచారు. నాలుగో వికెట్‌కి వీరిద్దరు కలిసి 67 పరుగులు జోడించారు.  జాదవ్ వేసిన 26వ ఓవర్ 4వ బంతికి విలియమ్‌సన్(39) అవుట్ అయ్యాడు. ఆ వెంటనే లాథమ్(37) చాహల్ ‌బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే  32 బంతుల్లో 44 పరుగులు చేసి కివీస్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేసిన నీశమ్‌ని ధోనీ చాకచక్యంగా రనౌట్ చేశాడు. చివర్లో బౌలర్లు పరుగులు చేసే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యూజిలాండ్ 44.1 ఓవర్లలో 217 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీని ఫలితంగా రోహిత్ సేన 35 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ని 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అంబటి రాయుడుకి దక్కగా, ఈ సిరీస్‌లో 9 వికెట్లు పడగొట్టిన షమీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

leave a reply