కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీని వీడిన కీలక నేత..!

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో గత ఎన్నికలలో జరిగిన బంగపాటును సరిదిద్దుకుని ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం అని ఎన్నికలకు సిద్ధ పడుతున్న కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. దశాబ్దాలుగా జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్ర సూర్యనారాయణ దేవ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరాలనే విషయం ప్రకటించని కిషోర్ సన్నిహితులతో చర్చించిన అనంతరం ప్రకటిస్తానని తెలిపారు.

పార్టీని విడే సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదని, పార్టీలో సీనియర్లకు గౌరవం లేదని విమర్శించారు. ఆయన టీడీపీలో చేరుతున్నారన్న సమాచారం జిల్లావ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. తొలుత నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకుడు టీడీపీలో చేరుతారని ప్రచారం జరిగినా.. ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అందటం లేదు. ఈ సమయంలో కిశోర్‌ చంద్రదేవ్‌ పేరు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది.

విజయనగరం జిల్లాలో 1977 నుంచి కాంగ్రెస్‌ కీలక నేతగా ఎదిగిన కిశోర్‌ చంద్ర దేవ్‌.. ఇందిరా గాంధీతో విభేదించి కాంగ్రెస్‌(ఎస్‌)లో కొన్నాళ్లు కొనసాగినా.. వెంటనే మళ్లీ కాంగ్రెస్‌లో చేరి చట్టసభలకు ఎన్నికయ్యారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్‌ అధిష్ఠానం వద్ద తనదైన పట్టును సాధించారు. ఈ కారణంగానే ఆయన కేంద్ర రాజకీయాలపైనే ఎక్కువగా ఆసక్తి కనబరిచి వాటికే తన సమయాన్ని కేటాయించేవారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో… ఒకే పార్టీలో ఉన్నా కిశోర్‌ చంద్రదేవ్‌, శత్రుచర్ల మధ్య వైరం కొనసాగేది. ముఖ్యంగా పార్వతీపురం డివిజన్‌లో ఇద్దరూ పట్టు సాధించడం కోసం సర్వ శక్తులు ఉపయోగించేవారు. కానీ, రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ప్రజాగ్రహానికి గురైంది. ఫలితంగా 2014 ఎన్నికల ముందే శత్రుచర్ల టీడీపీలో చేరి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు.

అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీచేసిన కిశోర్‌చంద్రదేవ్‌ ఓటమి చవిచూడవలసి వచ్చింది. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో కిశోర్‌ టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుండగా.. అందులోనూ కిశోర్‌ చంద్రదేవ్‌కు విజయనగరం ఎంపీ అశోక్‌ గజపతిరాజుకు కుటుంబపరంగా సన్నిహిత సంబంధాలున్నాయి. అందువల్ల ఈ కాంగ్రెస్ కీలకనేత టీడీపీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న రాజకీయ విశ్లేషణలు మెండుగా వినిపిస్తున్నాయి.

leave a reply