కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు: చంద్రబాబు

అమరావతి: పశ్చిమ బెంగాల్ లో కేంద్రం చర్యను వైసీపీ అధ్యక్షుడు జగన్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్ప అంతా ఖండించారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడలేకే కులాల మధ్య జగన్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పాటు పడే ఏకైక పార్టీ టీడీపీనేనని సీఎం స్పష్టంచేశారు. పార్టీ నేతలతో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల బాగుకోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.

మోదీ పక్షాన జగన్ ఉండటం చూసి మైనార్టీలు ఆయనకు దూరం అయ్యారన్నారు. జగన్ కు ఉన్న కుల పిచ్చి ఏమిటో అందరికీ తెలుసని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చిన్నతనం నుంచే సామాజిక న్యాయం కోసమే తాను పోరాడానని, ఫెడరల్ ఫ్రంట్ అని తిరిగిన కేసీఆర్ నిన్న మమతా బెనర్జీ విషయంలో ఎందుకు నోరు మెదపలేదని సీఎం ప్రశ్నించారు. అమిత్ షా తలుపులు మూసేశానని మాట్లాడుతున్నారని.. భాజపా తలుపులను ప్రజలు ఎప్పుడో మూసేశారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. పలాస సభలో ప్రజలు లేక భాజపా నేతలు దిక్కులు చూశారని సీఎం అన్నారు.

ఎరువులు, విత్తనాలు దొరక్క 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టపోయారని చెప్పారు. విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకుని రాత్రిపూట పొలాలకు వెళ్లిన రైతులు చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై శాసనసభలో చేపట్టిన లఘుచర్చలో దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని చెప్పారు. వ్యవసాయానికి కేటాయింపులే కాకుండా అభివృద్ధి కూడా చేయగలిగామన్నారు.

వ్యవసాయంలో రాష్ట్ర వృద్ది 11 శాతం ఉండగా.. దేశంలో 2.4 శాతం ఉందని చెప్పారు. రైతుల ఆదాయం పెరిగేలా చేశామని.. సూక్ష్మసేద్యంలో దేశంలోని తొలి 10 జిల్లాల్లో ఆరు ఏపీలోనే ఉన్నాయన్నారు. రైతులకు కేంద్రం ఇచ్చే సాయం తక్కువగా ఉందని.. ఐదెకరాలలోపు భూమి ఉండాలని షరతులు విధించారని చంద్రబాబు విమర్శించారు. ఫసల్ బీమా పథకంలో కట్టే ప్రీమియంకు వచ్చే బీమా డబ్బుకు చాలా వ్యత్యాసం ఉంటోందన్నారు. రైతుల కోసం కర్నూలులో సీడ్ పార్కును తీసుకొస్తున్నామని, దీని ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని.. త్వరలో అన్నదాతా సుఖీభవ పథకాన్ని కూడా తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు. ఉద్యాన రంగంలో తక్కువ ఖర్చుతో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరుతోందన్నారు. ఈ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని.. దక్షిణాదిలో పండే పండ్లు, కూరగాయల్లో ఎక్కువ శాతం ఏపీ నుంచే ఉంటున్నాయని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో కోటి ఎకరాల్లో ఉ ద్యాన పంటలు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశానికి కావాల్సిన ఆక్వా ఉత్పత్తులన్నీ ఏపీ నుంచే అందిస్తున్నామని.. రాష్ట్ర రైతుల ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి కావాలని ఆయన ఆకాంక్షించారు.

leave a reply