ఏపీ అంటే అన్నీ ఆపేయ్.. అంటున్నారు..!

ఏపీ అంటే అన్నీ ఆపేయ్ అని మోడీ అంటున్నారని కేంద్రంలోని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. “మన రాజధానికి డబ్బులు ఇవ్వడానికి మనసొప్పదు కానీ… గుజరాత్లో పటేల్ విగ్రహానికి రూ.3వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇదేం న్యాయం” అని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. విద్యా సంస్థలకు రూ.11వేల కోట్లు అవసరంకాగా… ఇప్పటికి 600 కోట్లు మాత్రమే ఇచ్చారని… ఇలాగైతే 30 సంవత్సరాలైనా వాటి నిర్మాణం పూర్తి కాదని అన్నారు.

కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ను ప్రభుత్వమే ప్రైవేటు సంస్థల ద్వారా ముందుకు తీసుకెళుతుందని పునరుద్ఘాటించారు. విమానాశ్రయాల విస్తరణకు రాష్ట్రప్రభుత్వం భూములు ఇచ్చినప్పటికీ… కేంద్రం పనులు చేయడంలేదని తెలిపారు. “అమరావతి నుంచి సింగపూర్ కు విమాన సర్వీసును కష్టపడి రాష్ట్రం తీసుకొచ్చింది. అది కూడా రాకుండా కేంద్రం అడ్డుకునే ప్రయత్నం చేసింది” అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు.

పైగా… కేసీఆర్ కు పరిణతి ఉందని, నాకు లేదని పార్లమెంటులో విమర్శించారు. నాది యూటర్న్ అని, వైసీపీ ట్రాప్లో పడ్డానని మోదీ అనడం సిగ్గు చేటు. నాది యూ టర్న్ కాదు… రైట్ టర్న్. నేను వైసీపీ ట్రాప్ లో పడటం కాదు… మోదీయే అవినీతి వైసీపీ ట్రాప్లో పడ్డారు! ఏపీకి కేంద్రం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా బీజేపీని నిలదీయరు. చివరకు ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు రాష్ట్రప్రభుత్వం నీళ్లు ఇస్తుంటే దానికి అడ్డుపడుతున్నారు.

ఏపీకి సోనియా హోదా ఇస్తామంటే వ్యతిరేకించిన కేసీఆర్ గెలిస్తే జగన్ సంబరపడిపోయారు. వైసీపీ ఇప్పుడు కోడికత్తి పార్టీగా మారింది” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తనకు రిటన్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని… ఆయన ఎవరిని బెదిరిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. “జగన్, పవన్ కు లాలూచీ రాజకీయాలు అవసరం. నాకు ఆ అవసరం లేదు. నాకు కావలసింది రాష్ట్ర ప్రజల సంక్షేమం” అని స్పష్టం చేశారు.

“రాష్ట్ర విభజన కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి న్యాయం చేస్తామని మోదీ ప్రతి సభలో హామీ ఇచ్చారు. ఢిల్లీ చిన్నబోయేలా అమరావతి నిర్మిస్తామన్నారు. కానీ, నాలుగేళ్లు కాలయాపనతో మోసం చేశారు. ప్రధాని మోదీ చెవుల్లో సీసం పోసుకుని పడుకున్నారు. ఎవరేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. విభజన హామీలు పరిష్కరించాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను ఢిల్లీకి వెళ్లి ఎన్నిసార్లు కోరినా వినిపించుకోలేదు” అని చంద్రబాబు ఆక్రోశించారు.

leave a reply