కివీస్‌ను ఆడేసుకున్నారు…సిరీస్ మనదే!

టీమిండియా విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.  న్యూజిలాండ్‌లోనూ ఇదే రీతిలో తన ఫామ్ కొనసాగిస్తోంది.  న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘాన విజయాన్ని అందుకుంది. ఆసీస్‌లో వ‌న్డే సిరీస్ గెలుపొందిన భార‌త్ తాజాగా కివీస్‌పై కూడా ఆ ఘ‌న‌త‌ను అందుకుంది. వ‌రుస‌గా మూడు వ‌న్డేల్లోనూ విజయం సాధించి, మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సిరీస్ కైవసం చేసుకుంది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగునుయ్‌లో మూడో వ‌న్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243 పరుగులకు ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల ధాటికి అరంభంలోనే కివీస్ మూడు కీల‌క వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శ‌లో టేల‌ర్ (93), లాథ‌మ్ (51) అర్ధ‌శ‌త‌కాలతో రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది. వీరిద్దరు మిన‌హా మిగిలిన బ్యాట్స్‌మ‌న్ విఫ‌ల‌మ‌వడంతో న్యూజిలాండ్ 49 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగులకు ఆలౌట్ అయింది. భార‌త బౌల‌ర్ల‌లో ష‌మీ మూడు వికెట్లు తీయగా భువనేశ్వర్, చాహ‌ల్‌, పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు.

 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లలో ధావన్ (28)వికెట్ త్వరగా కోల్పోయిన వన్ డౌన్లో వచ్చిన కోహ్లీ(60), రోహిత్(62) కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు వీరిద్దరూ రెండో వికెట్‌కు 119 ప‌రుగులు జోడించి భార‌త్‌ విజ‌యానికి బాట వేశారు. అనంత‌రం వీరిద్ద‌రూ వెనువెంట‌నే అవుటైనా అప్ప‌టికే భార‌త్ సుర‌క్షిత స్థానానికి చేరుకుంది. రాయుడు (40 నాటౌట్‌), దినేష్ కార్తీక్ (38 నాటౌట్‌) మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్రత్త పడడంతో టీమిండియా ఘాన విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో బౌల్ట్ రెండు వికెట్లు, సాంట్‌న‌ర్ ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. ఈ విజ‌యంతో భార‌త్ సిరీస్‌లో 3-0 ఆధిక్యంతో మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

leave a reply