ప్రధాని హోదాలో నరేంద్రమోడీ ఏపీకి వస్తే.. ఆయనకు తగిన గౌరవం ఇవ్వటం లేదని తెగ బాధ పడిపోతుంది. ప్రధాని రాష్ట్రానికి వస్తుండగా విభజన హామీలపై మట్లాడతారేమోనని ప్రజలంతా ఎదురు చూశారు. కానీ, మోడీ కేవలం చంద్రబాబును, ఆయన కుమారుడిని తిట్టి ఏపీకి కావాల్సివన్నీ ఇస్తామని ఎప్పుడూ చెప్పే విధంగానే నోటిమాటగా చెప్పి వెళ్ళిపోయారు. రైల్వేజోన్ నుంచి ప్రత్యేకహోదా వరకు ఎలాంటి హామీలపైనా కనీస ప్రకటన మాత్రం చేయలేదు. దీనిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతూంటే వైసీపీ నేతలు మాత్రం మోడీ ప్రసంగం గురించి స్పందించడం లేదు.
కేవలం మోడీ గౌరవానికి భంగం వాటిల్లుతోందంటూ వారు బాధపడిపోతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరేంద్రమోడీపై పూర్తి సానుకూలత ప్రకటించింది. గతంలో టీడీపీ నుండి ఆ పార్టీలోకి చేరిన సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.. నరేంద్రమోడీ పర్యటనలో ఏపీ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని చంద్రబాబు మరియు ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రవర్తన సంస్కార హీనంగా ఉందని, ఆంధ్రుల పరువు తీశారని ఆవేదన చెందారు.
ప్రధాని ఏపీకి అతిథిగా వస్తే అవమానిస్తారా? దూషిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీకి పూర్తి మద్దతు ప్రకటించారు. అతిథిగా వచ్చినప్పుడు గౌరవించి మనకు ఏం కావాలో వినయంగా చెప్పుకోవాలని, చంద్రబాబుకు వినయ విధేయతలు నేర్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు లాంటి సంస్కారహీనుడు ఏపీ సీఎంగా ఉండటం శోచనీయమని, కనీసం మోడీని స్వాగతించేందుకు కూడా ప్రొటోకాల్ అధికారులు, మంత్రులు వెళ్లలేదని, ఇంతకంటే దుర్మార్గం లేదని తీర్మానించేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ దారుణంగా అన్యాయం చేసినప్పటికీ.. వైసీపీ నేతలు మాత్రం ఆ పార్టీకే మద్దతు తెలియచేస్తూ.. ఏపీకి ఇచ్చిన హామీలపై నోరు మెదపడం లేదు. దీనితో టీడీపీ చేస్తున్న విమర్శలకు ప్రత్యక్షంగానే.. వైసీపీ అంగీకరించడంతో రాష్ర్ట ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.