దొంగతనానికి వెళ్లి పోలీసులకు ఫోన్‌ చేశాడు..!

దొంగ, పోలీసుల సహాయం కోరడమేంటా.. అని షాకయ్యారా.. మామూలుగా ఈలాంటి సంఘటనలు సినిమాల్లో చూస్తూ ఉంటాం.. కాని ఆ పరిస్థితే నార్వేలోని ఓ యువకుడికి ఎదురైంది. కొన్ని కొన్ని విచిత్రకరమైన సంఘటనలు ఒక్కోసారి భలే నవ్వు తెప్పిస్తాయి. దొంగతనానికి వెళ్లి, కారులో చిక్కుకుపోయి, చివరకు సాయం కోసం పోలీసులకే ఫోన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలీసులు ట్వీట్ చేయడం ద్వారా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

అసలు ఏం జరిగిందంటే.. కారులో ఉన్న కొన్ని వస్తువులు దొంగతనం చేయడానికి వెళ్లగా అందులో చిక్కుకుపోవడంతో, సాయం కోసం ఓ టీనేజ్‌ యువకుడు(17) పోలీసులకు ఫోన్ చేశాడు. ‘ఆ కారులో కూర్చొనే మాకు ఫోన్‌ చేశాడు. కారు లాక్‌ పడటంతో అతడు దాంట్లోంచి బయటపడలేకపోయాడు. ఒక స్నేహితుడికి కాల్ చేసినట్లు చేశాడు. మాకు ఫోన్‌ చేసినప్పుడు అతడు చాలా భయంతో ఉన్నాడు. అతడిని కారులో నుంచి బయటకు తీసుకురాగానే ఆ భయం మొత్తం మటుమాయమైంది’ అని ఆ ట్వీట్‌లో వెల్లడించారు నార్వే పోలీసులు. ఆ తర్వాత పోలీసులు అతడిని స్టేషన్‌ తీసుకెళ్లి విచారించి, తల్లిదండ్రులకు అప్పగించారు.

leave a reply