సుప్రీం కోర్టు: ఏ మహిళ అయినా… అంతే

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను భర్త  పలుసార్లు హెచ్చరించాడు. అయినా ఆమె మానలేదు. ఓ సారి నేరుగా చూసిన భర్త ఆమెను వేశ్య అనే పదం వచ్చేలా తిట్టాడు. దీంతో కోపంతో రగిలిన ఆ మహిళ భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. దీంతో సుప్రీం కోర్టు ఆ హత్యను పరిస్థితుల ప్రభావంతో జరిగిన హత్యగా భావించాలి తప్పితే ప్రణాళికా బద్ధంగా జరిగిన హత్యగా చూడకూడదని పేర్కొంది. దీంతో ఈ హత్యను ఐపీసీ 304 కింద పరిగణిస్తూ ఆమెకు, ఆమె ప్రియుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఓ మహిళకు ఎదురింటి వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇది భర్త దృష్టిలో పడడంతో అతడు పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరు మారకపోవడంతో ఓసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో భార్యను, తన కుమార్తెను వేశ్య అన్న అర్థం వచ్చేలా తిట్టాడు.

అంతే.. ఆ మాట వినగానే సివంగిలా లేచిన భార్య.. భర్త మెడపట్టుకుని టవల్ బిగించి చంపేసింది. ప్రియుడు కూడా ఈ హత్యకు సహకరించాడు. అనంతరం భర్త మృతదేహాన్ని ఇద్దరూ కలిసి తగలబెట్టి కాల్చి బూడిద చేశారు. నెల రోజుల తర్వాత విషయం బయటకు రావడంతో కేసు నమోదైంది. తొలుత స్థానిక కోర్టు, ఆ తర్వాత హైకోర్టు మహిళను, ఆమె ప్రియుడిని దోషులుగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు శిక్ష విధించాయి. 

శిక్ష పడిన మహిళ ఊరట కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు.. మహిళ వాదనను సమర్థించింది. తనను సెక్స్ వర్కర్ అనడంతో ఆమె తట్టుకోలేకపోయిందని పేర్కొంది. మన సమాజంలో ఏ మహిళా సెక్స్ వర్కర్ అంటే సహించరని తెలిపింది. భర్త అలా పిలవడం వల్లే హత్య చేసిందని వివరించింది. అందువల్ల దీనిని ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా భావించరాదని, పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిన హత్యగానే భావించాలని అభిప్రాయపడింది. ఇది జీవిత ఖైదు పడేంత నేరం కాదని పేర్కొన్న ధర్మాసనం ఆమెకు, ఆమె ప్రియునికి చెరో పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

leave a reply