హిందు సాంప్రదాయ పండగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి.ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున “శివరాత్రి” వస్తూనే ఉంటుంది. దీనిని “మాసశివరాత్రి” అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని “మహా శివరాత్రి” అని.. ఆ రోజు చాలా విశిష్టమైనదని పండితులు చెబుతూ ఉంటారు. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణ పక్ష చతుర్ధశినాడే శివరాత్రి జరుపుకొవాలని శాస్త్ర నిర్ణయము కూడా.
శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన శుభప్రదమైన రాత్రి. రాత్రి ‘చీకటి’ అజ్ఞానానికి సంకేతం కదా, మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది? శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, మహేశ్వర దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల వలన అజ్ఞానం తొలగి అనగా చీకటి తొలగి జ్ఞాన వెలుగు ద్యోతకమవుతుంది. మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి.
హిందువులు ఎంతో ఇష్టంగా జరుపుకొనే సంక్రాంతి పండగ తర్వాత వచ్చే పండగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి. అన్ని పండగలు పగటి పూట జరుపుకుంటే ఈ పండగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము.ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసము ఉంటే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆ రోజు పగలంతా నియమ నిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకాము చేసిన యెడల శివునికి ప్రీతి కలుగుతుంది.దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు.
“మహాశివరాత్రి” పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.
మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడిని అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.
మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి. 1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.
శివుడు అభిషేక ప్రియుడు..
స్వామిని నీళ్ళతో అభిషేకం చేసిన చాలు.. తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు అందుకే శివునికి బోళాశంకరుడని పేరు. భగవంతుని పూజకు భక్తి ప్రధానం అని అర్ధం చేసుకోవాలి.సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివ నామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభ ఫలితాలు పొందుతారు.
కోరిన కోర్కెలు తీరుస్తుంటాడు..
మహాశివుడు మాతృవాత్సల్యం కలవాడు,అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించు కుంటుందో శంకరుడు కూడా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోర్కేలను తీరుస్తూ రక్షించు కుంటాడు. ఈ మహా శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంత జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే గోమాతకు బియ్యం, తోటకూర,బెల్లం కలిపి తినిపించి, గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేద వారికి అన్నదానం చేయాలి. పశు, పక్ష్యాదులకు కూడా ఏదైన అవి తినే ఆహార పదార్ధాలు మరియు త్రాగడానికి నీటిని వాటికి ఏర్పాటు చేయాలి. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్ష విరమణ చేయాలి. ఈ పద్దతులలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పోందుతారు.
ఈ విధంగా రోజంతా శివనామస్మరణతో గడిపితే శంకరుని అనుగ్రహం పొంది కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు బోధిస్తూ ఉంటారు.