అంత సీన్‌ లేదు.. 35దాటవు.

విజయం ప్రజాకూటమిదే: ఉత్తమ్‌

తెలంగాణా ఎన్నికల్లో ప్రజాకూటమి విజయంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ధీమా వ్యక్తంచేశారు. తమ కూటమి 75 నుంచి 86 స్థానాలు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన గోల్కొండ హోటల్‌లో కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల పోలింగ్‌లో భాగస్వాములైన, సహకరించిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అనేక విషయాల్లో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో దొర్లిన పొరపాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ కూడా క్షమాపణలు చెప్పారన్నారు. ఈవీఎంలు తరలింపు, భద్రపరిచే విషయంలో అవకతవకలు జరుగుతాయోమేనని కొందరికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈవీఎంలు మారవచ్చనే అనుమానాలు కూడా తమకు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను కార్యకర్తలు, నేతలు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.

ఓట్ల లెక్కింపు సందర్భంలో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లో ఒకసారి లాక్‌చేసిన తర్వాత అధికారులు ఎవరూ వెళ్లకూడదని, కొందరులోపలకు వెళ్తున్నారనే సమాచారం తమకు అందిందని వ్యాఖ్యానించారు. అందువల్ల ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడ ఉండే విధంగా అనుమతి ఇవ్వాలని కోరారు. 11న లెక్కింపు జరగనుందన్నారు. అనేకమంది ప్రజల ఓట్లు గల్లంతయ్యాయని, ఓటరు లిస్టులను సరిగా చేయకుండా ఎవరి కోసం ఇంత తొందరిగా ఎన్నికలు నిర్వహించారని ప్రశ్నించారు. పోలింగ్ బూత్‌ ఏజెంటే కౌంటింగ్‌ ఏజెంట్‌గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు.

100కు పైగాస్థానాలు వస్తాయన్న కేసీఆర్‌, కేటీఆర్‌ ఇప్పుడు తెరాసకు 80 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారని, ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రం వాళ్లకు 35కి మించి రావన్నారు. ఎగ్జిట్‌ ఫలితాల్లో కొన్ని భాజపా ఛానళ్లు తెరాసకు అనుకూలంగా చెప్పాయని ఆరోపించారు. సర్వేలను నమ్మొద్దని తనకు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఫోన్‌లో చెప్పారని వెల్లడించారు. కేసీఆర్‌ కుటుంబంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యానికి, సామాన్య ప్రజల హక్కులను కాపాడేందుకే తామంతా ఒక్కటయ్యామని వెల్లడించారు. కూటమి నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశారని, కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ జరిగిందన్నారు.

leave a reply