ఒక్కటైనా…యువతులు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన వివాహితులైన ఇద్దరు యువతులు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలకు ఈ విషయం తెలియడంతో  వారికీ వేరు వేరుగా పెళ్లి చేసి పంపించారు. అయితే ప్రస్తుతం వారు భర్తలకు విడాకులిచ్చి ఒక్కటయ్యారు. ఆ  యువతులు ఇద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టిన ఆరేళ్ల తర్వాత ఇద్దరు ఒక్కటవ్వాలని నిశ్చయించుకొని గత శనివారం గుడిలో స్నేహితులు, తమ న్యాయవాది ఎదుట పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహాన్ని ధ్రువీకరించేందుకు రిజిస్ట్రార్‌ నిరాకరించారు. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ, వారి పెళ్లిని గుర్తించేందుకు ఏ చట్టమూ లేదని ఆయన అన్నారు.

వివరాల్లోకి వెళ్తే హమీర్‌పూర్‌కు చెందిన 24, 26 ఏళ్ల వయసున్న ఇద్దరు యువతులు కొన్ని సంవత్సరాల క్రితం తమ కళాశాలలో మొదటిసారి ఒకరిపై ఒకరికి ఇష్టం పెంచుకున్నారు అలా చివరకి ఒక్కటయ్యేందుకు సిద్దమయ్యారు. అదే సమయంలో ఈ విషయం ఆ యువతుల ఇళ్లలో తెలియడంతో మధ్యలో చదువు మాన్పించేసి, ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు చేశారు. అయినా వారి ప్రేమ తార స్థాయికి చేరడంతో  తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. మాకు ఇష్టం లేని పెళ్లిని చేసారు. మేం ఒకరినొకరం విడిచి ఉండలేకపోతున్నాం. అందుకే మా భర్తల నుంచి విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు మేం కలిసి ఉండేందుకు న్యాయపరంగా పోరాడుతున్నాం అని చెప్పారు. విడాకులు తీసుకున్నందుకు భర్తల నుంచి ఎలాంటి భరణమూ ఆశించట్లేదని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ఈ యువతులు ఒక్కటైనందున వీరి పెళ్లిని గుర్తించని రిజిస్ట్రార్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని యువతుల తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు.  

leave a reply