సాంప్రదాయమా… చరిత్ర తిరగరాయడమా..?

తెలంగాణలో ఎన్నికలు ముగియగానే, ఇక ఎగ్జిట్ పోల్స్‌ కూడా వచ్చాయి. ఇక జాతీయ సర్వేలన్నీ గులాబీ పార్టీకే జై కొట్టగా… ఒక్క ఆంద్రాఆక్టోపస్ లగడపాటి సర్వేలు మాత్రం టీఆర్ఎస్‌కు షాకింగ్ ఫలితాలను ఇచ్చాయి. అయితే, ఒక్కసారి చరిత్రలోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడిన తెలంగాణలో కూడా తన ప్రభుత్వాన్ని 9 నెలలకు ముందే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు గులాబీ బాస్ కేసీఆర్.

కేసీఆర్ కంటే ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబులు కూడా తమ ప్రభుత్వాలను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్క బోర్లా పడ్డారు. అటువంటి చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ చరిత్ర తిరగ రాస్తారా…? ఉమ్మడి ఏపీలో అధికార పార్టీని ముంచిన ముందస్తు ఎన్నికలు తెలంగాణలో  ముగిశాయి.

ఇటు అధికార టీఆర్ఎస్, ప్రజాకూటమిల మధ్య పోరు నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఉన్నింది. కానీ, ఎగ్జిట్ పోల్స్ రాగానే జాతీయా సర్వేలు కేసీఆర్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. మరోవైపు లగడపాటి సర్వేలు మాత్రం గులాబీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

అయితే, ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ పార్టీ కూడా తిరిగి అధికారంలోకి రాలేదని…. కేసీఆర్‌ పరిస్థితి కూడా అలాగే అయ్యే పరిస్థితి ఉందనే వాదన లేదా చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. అంతేకాదు గజ్వేల్‌లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. లగడపాటి ప్రకారం చూస్తే గజ్వేల్‌లో కేసీఆర్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడని ఆయన అక్కడ ఓటమిపాలయ్యే పరిస్థితి ఉందని జోస్యం చెప్పారు. మరి అదే జరిగితే లెక్క ప్రకారం గజ్వేల్‌లో టీఆర్ఎస్ గెలవదు కనుక… ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండదు.

నాడు నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు… ఆయన చరిష్మా ముందు… నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి 1983 అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వాస్తవానికి ఆ ఎన్నికలు అదే ఏడాది ఆగష్టులో జరగాల్సి ఉండగా… జనవరిలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఎన్టీఆర్ హవా ముందు నిలవలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టకుంది. ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 202 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసింది. 1984లో తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలు నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్‌తో ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లి మరోసారి విజయం సాధించారు. అయితే, దీన్ని వేరుగా చూడాల్సిన అంశం.

1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎన్టీఆర్ నాలుగు నెలలముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈసారి పరాభవాన్ని మూటగట్టుకున్నారు ఎన్టీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే, 2003లో చంద్రబాబు వంతు వచ్చింది. అలిపిరిలో ఆయనపై మావోయిస్టులు దాడి చేశారు. అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. అయితే, అలిపిరి దాడి ఘటన తర్వాత చంద్రబాబు సానుభూతి పవనాలు వీస్తాయని భావించి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. చంద్రబాబు అంచనాలు తప్పాయి. వైయస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీని సాధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఐదేళ్ల పాటు ఉండాల్సిన ప్రభుత్వాన్ని 9 నెలలకు ముందే రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో నాలుగు పార్టీలు అంటే కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జనసమితి, కమ్యూనిస్టు పార్టీ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడటంతో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చాయి. ఒకానొక సందర్భంలో గులాబీ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అన్నట్లుగా టాక్ నడిచింది.

కానీ, జాతీయ సర్వేలు మాత్రం కేసీఆర్ వైపే మొగ్గు చూపుతుండగా లగడపాటి మాత్రం ప్రజాకూటమిదే అధికారం అని చెబుతున్నారు. ఓ వైపు సెంటిమెంటు మరో వైపు ప్రజాకూటమి నుంచి వచ్చిన గట్టి పోటీతో కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలిచి తిరిగి అధికారంలోకి వస్తుందా లేదా… చరిత్రను కేసీఆర్ తిరగరాస్తారా లేదా అనేది తెలియాలంటే ఫలితాల తేదీ డిసెంబర్ 11 వరకు వేచిచూడక తప్పదు.

leave a reply