ఉత్తమ్ అప్పీల్ నో-ఖాతర్.. టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం..!

టీ- కాంగ్రెస్ శాసన మండలి లెజిస్లేటివ్ పార్టీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖను మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆమోదించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, దామోదర్ రెడ్డి, సంతోష్, ప్రభాకర్ రావులు ఈ రోజు ఉదయం మండలి చైర్మన్ ని కలిసి ఓ లేఖ ఇచ్చారు. ఈ లేఖను స్వామిగౌడ్ ఆమోదించినట్టు శాసనమండలి సెక్రటరీ ప్రకటన విడుదల చేశారు.

కాగా, కాంగ్రెస్‌ఎల్పీని టీఆర్‌ఎస్‌లో కలుపుతున్నట్టు లేఖ ఇవ్వడం దారుణమని టీపీసీసీ చీఫ్ ‌ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆకుల లలిత, సంతోష్‌కు సీఎల్పీ మీటింగ్‌ పెట్టే అధికారం లేదని స్పష్టం చేశారు. ప్రభాకర్‌, దామోదర్‌రెడ్డి రెండేళ్ల కింద పార్టీ మారారని…రెండేళ్ల నుంచి వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు.

పార్టీ మారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను సస్పెండ్‌ చేయాలని గతంలో లేఖ ఇచ్చామని, కానీ తమ లేఖపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. తమ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ కోరగానే వెంటనే స్పందించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు పాటించాలని షబ్బీర్‌అలీ సూచించారు.

leave a reply