ఎన్నికల వేళ వైసీపీ కంగారు..!

సార్వత్రిక ఎన్నిక‌ల ద‌గ్గర‌ప‌డుతున్న సమయంలో వైసీపీ కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చేసిన పాద‌యాత్రలో రాష్ట్రమంతా తిరిగి, ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తెలుసుకుని, ప్ర‌జ‌ల మేనిఫెస్టోని త‌యారు చేస్తామంటూ జ‌గ‌న్ అప్ప‌ట్లో చెప్పారు. యాత్ర పూర్త‌యిపోయింది, ప్ర‌జా మేనిఫెస్టో అనే చ‌ర్చ వైకాపాలో ప్ర‌స్తుత‌మైతే లేద‌నే తెలుస్తోంది! ఎన్నిక‌ల ప్ర‌చారానికి కావాల్సిన కొన్ని బ‌ల‌మైన అంశాల కోసం జ‌గ‌న్ వెతుకులాట కొన‌సాగిస్తున్నారు అన‌డంలో సందేహం లేదు.

గ‌డ‌చిన నెల‌రోజుల్లో ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌నేది విశ్లేష‌కుల మాట‌. ప్ర‌భుత్వ వ్య‌తిరేక లేద‌నీ, అభివృద్ధి బాట‌లో ప‌య‌నం ప్రారంభించిన ఆంధ్రాకి మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడి నాయ‌క‌త్వం అవ‌స‌ర‌మనే అభిప్రాయం సామాన్యుల నుంచి వ్య‌క్త‌మౌతోంది. కొత్త సంక్షేమ ప‌థ‌కాలు, గ‌త నాలుగేళ్లుగా చేప‌ట్టిన ప్రాజెక్టుల ప్రారంభోత్స‌వాలు, రాయ‌ల‌సీమ జిల్లాలకు సాగునీటి త‌ర‌లింపు, రాజ‌ధానిలో జ‌రుగుతున్న నిర్మాణాలు… ఇవ‌న్నీ ఒకేసారి తెర‌మీదికి వ‌చ్చాయి. ప్ర‌తిప‌క్ష పార్టీకి విమ‌ర్శ‌లు చేసే అంశాలే దొర‌క్క‌కుండా పోయాయి.

దీంతో, ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న అభివృద్ధి చ‌ర్చ నుంచి ప్ర‌జ‌ల‌ను డైవ‌ర్ట్ చెయ్యాలంటే… ఏదో ఒక సంచ‌ల‌న‌మైన విమ‌ర్శ‌నాస్త్రం జ‌గ‌న్ కి కావాలి. గ‌డ‌చిన వారం రోజులుగా వైకాపా ప్ర‌య‌త్నం ఇదే. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల‌కు విఘాతం అంటూ గ‌త‌వారం ఓ వాద‌న‌ను ఎత్తుకున్నారు. ఆశించిన స్థాయిలో దానికి స్పంద‌న రాలేదు. వైసీపీ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌ను చంద్ర‌బాబు కాపీ కొడుతున్నారూ అని కూడా అన్నారు. ఆ అంశ‌మూ ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

ప్రస్తుతం కొత్త‌గా ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లు అని, ప్ర‌జాస్వామ్యం ఖూనీ అంటూ ఢిల్లీ వెళ్లి మ‌రీ హడావిడిగా విన‌తి ప‌త్రం ఇచ్చారు. ఓట‌మి భ‌యంతోనే చంద్ర‌బాబు ఈవీఎమ్ ల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నీ, ఇప్ప‌ట్నుంచే ఓట‌మికి కార‌ణం వెతుక్కుంటున్నార‌ని ఢిల్లీలో జ‌గ‌న్ విమ‌ర్శించారు.

అధికారుల‌ను బ‌దిలీ చేయాల‌ని వీరే సూచించేస్తుంటే ఎలా..? ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎవ‌రెవ‌ర్ని నియ‌మించాలి, ఏ ప‌ద్ధ‌తిన నియ‌మించాలి, స్థానికంగా ఉన్న‌వారికి వేరే ప్రాంతాల బాధ్య‌త‌లు ఇవ్వాలి, మూడేళ్లు ఒకే చోట ప‌నిచేస్తున్న అధికారులను వేరే ప్రాంతాల‌కు విధి నిర్వ‌హ‌ణ‌కు పంపాలి… ఇలాంటివ‌న్నీ ఎన్నిక‌ల సమ‌యంలో ఈసీ సాధారణంగా చేసే ప‌నులే. కానీ, ఇప్పుడు ఈసీకి కూడా వైకాపా స‌ల‌హాలు ఇచ్చేస్తోంది! అంటే… రేప్పొద్దున్న ఈసీ చేసే ప‌నుల‌ను కూడా త‌మ విజ‌యంగా ప్ర‌చారం చేసుకుంటారేమో మ‌రి! ఏదేమైనా, ఓట‌ర్ల జాబితా అంశాన్ని ప్ర‌ధాన ప్ర‌చారాస్త్రంగా మార్చుకోవాల‌ని వైకాపా భావిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కూడా ఇలాంటి విఫ‌ల‌య‌త్న‌మే చేసింది. ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాలంటూ మర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కేసులు కూడా పెట్టారు. రాజ‌కీయంగా ఈ అంశం కాంగ్రెస్ కి క‌లిసిరాలేదు. అలాగని, ఓటర్ల జాబితాలో అవకతవకలపై వైకాపా పోరాటాన్ని ఎవ్వరు తప్పుబట్టటం లేదు. కానీ, దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకునే ప్రయత్నం.. వారి రాజకీయ వ్యూహాల్లో గందరగోళ పరిస్థితులకు అద్దం పడుతోందన్నది వాస్తవం.

leave a reply