ఏపీలో రైతుబంధు.. కౌలు రైతులకు కూడా..!

vఆంధ్రప్రదేశ్ రైతులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్‌లో నిర్మయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం “రైతుబంధు” పేరుతో.. ఓ పథకాన్ని రైతులకు పెట్టుబడి సాయం కోసం అమలు చేస్తోంది. ఆ తరహాలోనే పలు రాష్ట్రాలు పథకాలను ప్రారంభించాయి.

అయితే.. ఆ పథకంలో ఉన్న లోపాలను సవరించి ఏపీలో వినూత్నంగా అమలు చేయబోతున్నారు. కౌలు రైతులందరికీ సాయం అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు రైతుల కన్నా కౌలు రైతులే ఎక్కువన్న లెక్కలు ఉన్నాయి.

ఈ కారణంగా కౌలు రైతులకు సాయం అందకపోతే.. పథకం ఉద్దేశం నెరవేరదని భావిస్తున్నారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తోంది. కొన్ని జిల్లాల్లో బ్యాంకులతో రుణాలిప్పించడానికి ఈ కార్డులు మంజూరు చేశారు. వీటిని అన్ని జిల్లాల్లో మంజూరు చేస్తారు. ఖరీఫ్‌ నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకం పూర్తిగా నగదు బదిలీ రూపంలోనే ఉంటుంది. రుణమాఫీ అమలు సమయంలో రాష్ట్రంలోని మొత్తం రైతుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. రుణమాఫీ పొందిన కుటుంబాలన్నింటికీ ఇది వర్తించే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాల పరంపరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నగదు బదిలీ పథకాలను వెల్లువలా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే.. పెన్షన్లు రెట్టింపు చేశారు. డ్వాక్రా మహిళలకు రూ. పదివేలు, స్మార్ట్ ఫోన్ పంపిణీ చేయనున్నారు. ఇప్పుడు నేరుగా.. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెడుతున్నారు. ఈ సంక్షేమం ఓట్ల వర్షం కురిపిస్తుందన్న ఆశాభావంతో… టీడీపీ వర్గాలు ఉన్నాయి. నిజానికి.. కేంద్ర ప్రభుత్వం కూడా… రైతుల కోసం.. ఓ నగదు బదిలీ పథకం పెట్టబోతోందని చెబుతున్నారు. అదే జరిగితే రైతులకు మరింత మేలు జరగనుంది.

leave a reply