తాత్కాలిక బడ్జెట్.. అమలు సాధ్యా.. సాధ్యాలు..!

ఆర్థిక సంవత్సరానికి అవసరమైన లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటికి నిధులు కేటాయించడమే బడ్జెట్ ప్రాథమిక లక్ష్యం. ఎన్ని రకాలుగా చెప్పినా.. ఎన్ని లెక్కలు వేసినా.. ప్రభుత్వాలు చేసేది ఇదే.   దేశ సమగ్ర అభివృద్ధి కాకుండా… ప్రజల్ని మభ్య పెట్టే పథకాలు ప్రకటించడం, ఎన్నికలకు ముందు వచ్చే బడ్జెట్‌లో వరాలు ప్రకటించడం లాంటివి సర్వసాధారణంగా మారాయి. ఇన్నాళ్లూ సాగుతూ వచ్చిన ఈ ఒరవడిని కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్. ఎడమచేత్తో లాక్కుని.. కుడి చేత్తో ఇస్తున్నామనే సరికొత్త ప్రయోగాన్ని విజయవంతంగా చేశారాయన. మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన వరాలన్నీ సక్రమంగా అమలవుతాయని ఆశించవచ్చో తెలియడం లేదు.

ఎన్నికల వేళ బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ఐదెకరాల్లోపు రైతులకు ఏటా ఆరువేల రూపాయలు ఇస్తామని… ఐదు లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించారు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి. దేశంలో 40 కోట్ల మందికి ప్రయోజనం కలిగేలా ఫించను పథకాన్ని ప్రకటించింది. ఇవన్నీ కాకుండా గ్యాస్ కనెక్షన్లు, ఇళ్లు, అవీ ఇవీ  అంటూ హామీలు దంచేశారు.

బడ్జెట్ ప్రసంగాన్ని మొదలు పెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్.. మొదటి నుంచే యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ఎన్డీయే సాధించిన విజయాలను ఆలపించే ప్రయత్నం చేశారు. ద్రవ్యలోటుని కట్టడి చేశామని… ద్రవ్యోల్బణం నడ్డి విరిచామని చెప్పుకొచ్చారు. మన్మోహన్ పాలనకు.. మా పాలనకు బేరీజు వేసుకోండి అంటూ కొన్ని ఉదాహరణలు సంధించే ప్రయత్నం చేశారు. నిజమే. మరి మన్మోహన్ హయాంలో ముడి చమురు రేటు ఎంత ఉంది? అప్పుడు పెట్రోల్ ధర ఎంత ఉంది? ఇప్పుడు ముడి చమురు ధర ఎంత ఉంది? పెట్రోల్ ధర ఎంత ఉంది? ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ మీద తొమ్మిది సార్లు ఎక్సైజ్‌టాక్స్ పెంచిన విషయం దాచేస్తే దాగే సత్యమా? అనేది కూడా చర్చనియాంశమే.

ఇప్పటికే చాలా చేశామని.. 2022 నాటికి ఇంకా ఎంతో చేస్తామని సెలవిచ్చారు. పీయూష్ గోయల్ చెప్పిన వాటిలో అతి దారుణమైన అంశం. రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచామని. దేశంలో ఎక్కడైనా ఈ పరిస్థితి ఉందా..? వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధతు ధర పెట్టుబడి కంటే రెండున్నరరెట్లు అధికంగా నిర్ణయిస్తామని చెప్పారు. ఏ పంటకైనా ఇలా ధర నిర్ణయించారా? ఉపన్యాసాలిస్తే ధరలు పెరుగుతాయా? దేశ రాజధానిలోనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేంద్ర ఆర్థికమంత్రికి గుర్తు లేదా? రైతుల విషయంలో మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలం కాబట్టే.. దేశ వ్యాప్తంగా రైతులంతా రుణ మాఫీ, మద్దతు ధర కోసం ఆందోళన చేయాల్సి వచ్చింది. అది మర్చి పోగలమా..?

బడ్జెట్‌లో ప్రకటించిన మరో బూటకపు వ్యవహారం ఐదెకరాలులోపు ఉన్న రైతుల అకౌంట్‌లో ఆరు వేల రూపాయలు వేస్తామని. దీనికి సంబంధించిన విధి విధానాలేవీ వెల్లడించలేదు. ఈ పథకాన్ని 2018 డిసెంబర్ ఒకటి నుంచే ప్రారంభిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. ఇందు కోసం 20వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఐదెకరాలలోపు ఉన్న రైతులకు సాయం ఇస్తామన్న ప్రభుత్వం… ఐదున్నర ఎకరాల రైతుల గురించి ఆలోచించిందా? ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారంతా సంపన్నులా అనేది ఆలోచించల్సిన విషయం.

యూపీఏ హయాంలో బ్యాంకింగ్ రంగం కకావికలమైందని.. అడిగిన వారికల్లా అప్పులు ఇచ్చారనేది పీయూష్ గోయల్ ఆరోపణ. నిజమే యూపీఏ హాయాంలో అక్రమాలు జరిగాయి. మరి ఎన్డీయే ప్రభుత్వం చేసిందేంటి..? అక్రమాలకు పాల్పడినవాళ్లంతా విదేశాలకు పారిపోతుంటే.. ఎన్డీయే పాలకులు ఏం చేసినట్లు. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తీసుకొచ్చే చట్టం చేశామని చెబుతున్న పాలకులు.. అసలు వాళ్లు పారిపోతుంటే ఎందుకు ఆపలేకపోయారు..? నిరర్ధక ఆస్తుల నుంచి బ్యాంకుల్ని కాపాడేందుకు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిన  కేంద్ర ప్రభుత్వం.. రైతులకు సాయం చేశామని.. వాళ్ల జీవితాల్ని మార్చి వేస్తున్నామని ఘనంగా చెప్పుకుంటూ ఇస్తోందెత..? 75వేల కోట్ల రూపాయలు. ఇదెక్కడైనా అతుకుతోందా..?

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనపై ప్రతిపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన ఆరు వేల రూపాయలతో.. నలుగురున్న కుటుంబంలో ఒక్కొక్కరికి రోజుకి ఐదు రూపాయలు మాత్రమే వస్తాయని.. ఐదు రూపాయలతో దేశంలో గౌరవంగా ఎలా బతకవచ్చో చెప్పాలని విపక్షాలు చురకలు అంటిస్తున్నారు. కేంద్రం తెచ్చిన కొత్త స్కీమ్ వల్ల రైతులకు దక్కేది రోజుకు 17 రూపాయలు మాత్రమేనని.. ఇది రైతుల్ని అవమానించడమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఐదెకరాల లోపు ఉన్న రైతుల్ని గుర్తించడం కేంద్ర ప్రభుత్వానికి అంత తేలికైన వ్యవహారం కాదు. దేశంలో చాలా రాష్ట్రాల్లో భూముల రికార్డులకు సంబంధించిన ప్రక్షాళన జరగలేదు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ల్యాండ్ రెవిన్యూ రికార్డుల్ని పక్కాగా నిర్వహిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందే రైతుల అకౌంట్‌లో డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తే.. ఐదెకరాల లోపు రైతుల్ని ఎలా గుర్తిస్తారనేది ప్రస్తుతానికి బేతాళ ప్రశ్న.

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే.. అధికారంలో ఉన్న వారికి పేద ప్రజలు, కార్మికులు, శ్రామికులు, వారి కష్టాలు గుర్తుకొస్తాయి. వారిని ఉద్దరించే పథకాలు పుట్టుకొస్తాయి. ఎన్నికల ప్రయోజనాల కోసం హడావుడిగా వండి వార్చే స్కీములకు తలా తోకా ఉండదు. నెలకు వంద రూపాయలు కడితే చాలు.. మీ బతుకు బంగారమైనట్లే అని ప్రకటిస్తారు. ఆ వంద రూపాయలు ఎక్కడ కట్టాలి. ఎవరికి కట్టాలి. ఎంతకాలం కట్టాలనే సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలుండవు. ఇప్పటికే ఉన్న పెన్షన్ పథకాల కంటే .. తాజా బడ్జెట్‌లో ప్రకటించిన పెన్షన్ స్కీమ్ గొప్పదా..? ఒక వేళ ఉన్నా అది దిర్ఘకాలిక పథకం కాబట్టి తాత్కాలిక బడ్జెట్‌లో చెప్పవలిసిన అవసరం లేదు అని చెప్పవచ్చు.

గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అనే పేరు గొప్ప పథకాన్ని ప్రకటించింది. పథకాన్ని ప్రకటించారు కానీ అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా..? ఎంత కట్టాలి..? ఈ పథకం ద్వారా అందే ప్రయోజనాలేంటనే దానిపై సామాన్యూలకు ఇంత వరకూ అవగాహన లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్  కంటే మెరుగైన ఆరోగ్య పథకాల్ని అమలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగానే.. తాజా బడ్జెట్‌లో మరో స్కీమ్ తీసుకొచ్చింది మోడీ సర్కారు. అసంఘటిత రంగంలో కార్మికుల కోసం ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ పేరుతో వచ్చిన ఈ స్కీమ్ 40 కోట్ల మందికి మేలు చేస్తుందని ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్ గోయల్

 ఈ పథకంపై మరింత స్పష్టత కావాలంటున్నాయి కార్మిక సంఘాలు. ఈ స్కీమ్ కింద అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారికి 60 ఏళ్ల తర్వాత మూడు వేల రూపాయల పించను ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఇందు కోసం కార్మికులు నెలకు వంద రూపాయలు చెల్లించాలని ఆర్థికమంత్రి చెప్పారు. దేశంలో 42 కోట్లమంది అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. వీరిలో కార్మికులు, కూలీలు, రిక్షాపుల్లర్లు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, గృహాల్లో పని చేసే పనిమనుషులు లాంటి అనేక వర్గాలున్నాయి. వీరందరినీ ఇందులోకి తీసుకు రావడం ఎలా అనేది మాత్రం కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. పైగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెబుతోంది.

ప్రధానమంత్రి శ్రమయోగి మాన్‌ధన్ స్కీమ్‌కు ప్రస్తుతం 500 కోట్ల రూపాయలు కేటాయించారు. అవసరమైతే ఇంకా ఇస్తామని చెబుతున్నారు. పేదలు, కార్మికుల కోసం ఇప్పటికే అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ , ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజనకు ఇది అదనం అని చెబుతున్నారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలో కెల్లా ఇదొక పెద్ద పెన్షన్ స్కీమ్ అవుతుందని కేంద్రం చెబుతున్నా… కార్మికుల ఓట్ల మీద ఉన్న శ్రద్ద… స్కీమ్‌ అమలు మీద కనిపించడం లేదు.

అసంఘటిత రంగంలో కార్మికుల కోసం మోడీ సర్కారు ఇప్పటికే అటల్ పెన్షన్ యోజన తీసుకొచ్చింది. 2015లో నాటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ… కాస్త అటు ఇటుగా ఇలాంటి స్కీమునే ప్రకటించారు. అటల్ పెన్షన్ యోజన కింద.. లబ్ధి దారులు వారు చెల్లించే దాన్ని బట్టి వెయ్యి రూపాయల నుంచి  ఐదు వేల రూపాయలు పొందే వెసులుబాటు ఉంది. ఇందు కోసం ప్రతీ నెలా 42 రూపాయల నుంచి 210 రూపాయలు చెల్లించాలని… పథకంలో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయో పరిమితిని నిర్ణయించారు. అటల్ పెన్షన్ యోజన లో లబ్ధిదారుల కోసం ప్రభుత్వం సంవత్సరానికి వెయ్యి రూపాయలు జమ చేస్తుంది. తాజాగా ప్రకటించిన పథకంలో ఇంత కంటే గొప్ప అంశాలు ఏమున్నాయో పీయూష్ గోయల్ గుర్తించారో.. లేదో తెలియాల్సి ఉంది.

పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వం ప్రాథమిక ధర్మం అని.. లబ్ధిదారులు ఎంత కట్టారనేది ముఖ్యం కాదని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి.  అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు ఏడాది పొడవునా పనులు ఉండవని.. తుపానులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు… నెలల తరబడి పనులు దొరకవని… వ్యవసాయం కూలీలకు ఒక్కోసారి మూడు నెలలకు పైగా ఖాళీగా ఉంటారని.. ఇలాంటి వారికి నెలకు వంద రూపాయలైనా భారంగా మారుతుందని అంటున్నారు.

మరో కీలక విషయం అసంఘటిత రంగంలో ఉన్న వారిలో నిరక్షరాస్యులు ఎక్కువ. వీరంతా ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండరు. కూలి పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస పోతుంటారు. నిద్ర లేవగానే.. పనుల కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు.. కూలీలు పెన్షన్ ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కుని అక్కడకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, నెలకోసారి అక్కడకు వెళ్లి వంద రూపాయలు కట్టి రావడం సాధ్యమయ్యే పనేనా..? నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చే మూడు వేల రూపాయలు ఏ మూలకు వస్తుందో చెప్పాలంటున్నాయి కార్మిక సంఘాలు.

దేశ ఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం కీలక పాత్ర పోషిస్తోంది. కోట్ల మంది కార్మికులు, శ్రామికులు తమ జీవనోపాధి కోసం శ్రమిస్తున్నా.. వారి శ్రమతోనే దేశం ముందుకు నడుస్తోందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఉపాధి విషయంలోనే కాదు.. అనేక విషయాల్లో కార్మికుల్ని అభద్రత వెంటాడుతోంది. వీరి కోసం ప్రభుత్వాలు ప్రతీ బడ్జెట్‌లోనూ పథకాలు ప్రకటిస్తున్నా.. అవి లక్షిత వర్గాల్లో పది శాతం మందికి కూడా చేరడం లేదు. కేంద్రంలో ఉన్న పాలకులు.. ఏటేటా కొత్త పథకాల్ని ప్రకటించి ఓట్లు దండుకోవాలనే ఆలోచన చేయడం కంటే.. ఉన్నవాటిని సమర్థవంతంగా అమలు చేయడం వల్ల దేశానికి, కార్మికులకు, అధికారంలో ఉన్న పార్టీకి, ఎక్కువ ఉపయోగం ఉంటుంది. 

అగ్రవర్ణాల్లో పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చట్టం చేసింది. 8 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్న వారంతా పేదవారిగా గుర్తించింది కేంద్రం. తాజాగా ప్రకటించిన బడ్జెట్‌లో వార్షికాదాయం 5 లక్షలు దాటితే పన్ను బాదుడు తప్పదని తేల్చారు కేంద్ర ఆర్థికమంత్రి. ఐదు లక్షల రూపాయల తర్వాత ఒక్క రూపాయి అదనపు ఆదాయం ఉన్నా.. పాత శ్లాబుల ప్రకారం పన్నులు చెల్లించాల్సిందే. 8 లక్షల ఆదాయం ఉన్న వారంతా పేదవారని ఓ వైపు చెబుతున్న కేంద్ర ప్రభుత్వమే… వారి మీద పన్నుల భారం మోపడం న్యాయమేనా..? అని ఆలోచించాల్సి ఉంది.

ఆర్థిక శాస్త్రంలో న్యాయం- అన్యాయం కంటే… లాభాలు-నష్టాల గురించిన పట్టింపే ఎక్కువ. కావచ్చు. ఆర్థికపరమైన లెక్కలతో పాటు సామాజిక సమతౌల్యత పాటించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వారి మీద ఉంది. రిజర్వేషన్లు ఇవ్వడానికి 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చేవారిని పేదవారిగా గుర్తించిన పాలకులే.. ఐదు లక్షల రూపాయల ఆదాయం దాటిన వారంతా పాత శ్లాబుల ప్రకారం పన్ను కట్టాలంటే అంత కంటే అన్యాయం ఏముంది..? ఓట్లు అవసరమైన చోట ఒక లెక్క.. ఆదాయం అవసరమైన చోట మరో లెక్కా..? పాలకుల నాలుక ఎంత పలుచనగా ఉంటుందో.. అది ఎన్ని రకాలుగా మెలికలు తిరుగుతుందో చెప్పేందుకు ఇదొక నిదర్శనం.

ఐదు లక్షల రూపాయల వరకూ ఆదాయపు పన్ను లేదని ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి. ఆయన ఈ ప్రకటన చేసినప్పుడు… లోక్‌సభలో బల్లలు భయపడేలా అధికార పార్టీ సభ్యులు వాటిపై నిముషం పాటు చరుస్తూనే ఉండి పోయారు. ఐదు లక్షల రూపాయల వరకూ ఓకే. ఐదు లక్షల ఒక రూపాయి ఆదాయం ఉన్నా.. పాత శ్లాబుల ప్రకారం పన్నుల్ని ముక్కు పిండి వసూలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 80 సీ కింద లక్షన్నర వరకూ పొదుపు చేస్తే.. ఆరున్నర లక్షల రూపాయల వరకూ మినహాయింపు ఉంటుంది.  ఐదు లక్షలకు పైగా ఆదాయం ఉన్న వాళ్లు… ఇప్పటిలాగే… రెండున్న లక్షల నుంచి పన్ను కట్టాల్సి ఉంటుంది.

గత ఐదేళ్లలో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది. నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తర్వాత.. పన్నుల పరిధిలోకి కోట్ల మంది వచ్చి చేరారు. చాలా మంది నిజాయతీగా పన్నులు కడుతున్నారు. పన్నుల కడుతున్న వారికి దక్కాల్సిన ప్రయోజనాల్ని.. ప్రభుత్వం పెద్దలకు దారపోస్తోందనే విమర్శలు ఉన్నాయి. జీఎస్టీ అమలుతో పన్నుల్ని సరళీకరించామని ప్రభుత్వం చెబుతున్నా.. వస్తు సేవల పన్ను వల్ల దేశంలో అనేక ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ఆదాయం పెరిగింది తప్ప.. పేద, మధ్యతరగతి వర్గానికి దక్కిందేమీ లేదు. ఓ వైపు ద్రవ్యోల్బణం ఐదు శాతం ఉందని చెబుతూనే.. మరోవైపు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ సరిపోతుందని చెప్పడం పాలకుల గడుసుదనం కాక మరేంటి?

తాము అధికారంలోకి వస్తే.. విద్య. వైద్య రంగాలకు పెద్ద పీట వేస్తామని ప్రకటించారు నరేంద్రమోడీ. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఎన్డీయే పాలనా మొదలైన తర్వాత… ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ఉద్యోగాలు అడిగేవాళ్లు కాదు… ఉద్యోగాలు ఇచ్చే వారు పెరుగుతున్నారని కేంద్ర ఆర్థికమంత్రి తన బడ్జెట్‌లో గొప్పగా చెప్పుకొచ్చారు. స్టార్టప్ ఇండియా సూపర్ సక్సెస్ అయిందని డబ్బా కొట్టారు. మోడీ హాయంలో ప్రారంభమైన స్కీముల్లో అట్టర్‌ ఫ్లాప్ అయిన స్కీముల జాబితాలో అన్నింటికంటే ముందుంది స్టార్టప్ ఇండియా. ఈ స్కీమ్ కింద ప్రారంభమైన కంపెనీల్లో 61 శాతం సంస్థలు మూలన పడ్డాయి. ఒకటి రెండు సంస్థలు తప్ప మిగతావి ఏవీ సక్సెస్ కాలేదు. ఉద్యోగాలకు సంబంధించి.. ఎకనామిక్ సర్వే ఇచ్చిన నివేదికలో అంశాల గురించి ప్రస్తావించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది.

రైల్వే లైన్లు, ప్రాజెక్టుల కోసం  తెలుగు రాష్ట్రాలు చాలా ప్రతిపాదనలు పంపినా.. అవన్నీ చెత్తబుట్ట పాలయ్యాయి. మిషన్ భగీరద, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు లాంటి ప్రతిపాదనలు తెలంగాణ సర్కారు పంపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖలో రైల్వే జోన్, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన లాంటి ప్రతిపాదనలు ఏపీ నుంచి వెళ్లాయి. ఎప్పటిలాగే  కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. కేంద్రం తీరుపై తెలుగు రాష్ట్రాల పార్టీలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు.

అధికారంలో ఉన్న వాళ్లు… నాలుగేళ్లు పారిశ్రామికవేత్తలు, కార్పోరేట్ శక్తుల కోసం పని చేస్తారని.. ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే ప్రజల కోసం పని చేస్తారనే సత్యాన్ని మరోసారి నిరూపించింది పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగం. బడ్జెట్‌కు ముందు తమకు నిధులు కేటాయించాలని వివిధ రాష్ట్రాలు భారీగా ప్రతిపాదనలు పంపించాయి. ఇందులో ఏ రాష్ట్రానికి పెద్దగా దక్కిందేమీ లేదు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 58,166 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్రం..  మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూసింది.

leave a reply