ఏపీ పౌరులు కాదా..?

ఆంధ్రప్రదేశ్‌లో జీవిస్తూ, ఇక్కడే రాజకీయ పార్టీ నడుపుతూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి వేడుకల కోసం నారావారిపల్లెలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఐఏ కేసు విషయంలో ఏపీ విచారణ సంస్థ పైన జగన్, అలాగే ఏపీ పోలీసులపై నమ్మకం లేకే ప్రభాస్‌తో పేరుతో తనపై చేస్తున్న ప్రచారం మీద హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల చెప్పారు. దీనిపై చంద్రబాబు ఈ రోజు స్పందించారు.

ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటే ఈ రాష్ట్ర పౌరులుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఏపీలో ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. విశాఖలో జగన్ పైన దాడి జరిగితే ఎన్ఐఏ విచారణ కావాలని చెప్పారని, కోడి కత్తి కేసును ఎన్ఐఏకు ఇవ్వడంపై కోర్టుకు వెళ్లామని చెప్పారు.

పోలీసులపై వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేనప్పుడు ఏపీలో రాజకీయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. దుష్ప్రచారం చేస్తున్నారని పక్క రాష్ట్రంలో కేసులు పెడతారా అన్నారు. ఏపీలో ఎవరిమీదగా నమ్మకం లేకుంటే ఎలా అన్నారు. ఉన్నట్లుండి షర్మిల అలా ఎందుకు మాట్లాడారు తెలుగుదేశం పైన షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరిపైన కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని, నీతిమంతమైన రాజకీయాలు చేయడానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు. షర్మిల వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగారో తెలియదన్నారు. ఉన్నట్లుండి షర్మిల ఇప్పుడే వ్యక్తిగత దూషణలకు దిగారో తెలియడం లేదని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జగన్‌ను ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారు ఇలాంటి వారిని (జగన్) ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని చంద్రబాబు చెప్పారు. అంతగా కావాలనుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏపీలో టీఆర్ఎస్ కూడా పోటీ చేయవచ్చునని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పోవాలన్నారు. షర్మిల చేసిన ఆరోపణలు సరికాదని, తీవ్రంగా ఖండిస్తున్నామని, టీడీపీ ఎప్పుడూ అలాంటి పనులు చేయదని, ఈ రాష్ట్ర పౌరుడిగా ఉన్నప్పుడు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత లేదా? హైదరాబాద్‌లో ఉండి ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటున్నారని, ఇది కరెక్టు కాదని, ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండాలన్నారు. విభజన చట్టంలో హామీలు బీజేపీ అమలు చేయలేదని, దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, సీబీఐ, ఈడీ దాడులతో అణచివేయాలని చూశారని, అన్యాయం చేసినప్పుడే తిరుగుబాటు చేశామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వస్తున్నామన్నారు.

leave a reply