మేము రెఢీ.. మరి మీరూ..?

ఓటు మన బాధ్యత..

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 119 శాసనసభా నియోజకవర్గాలకు జరిగే ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరుతోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి తమ అనుభవాన్ని పంచుకున్నారిలా…

మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. ఇప్పుడు నా ఓటు హక్కును వినియోగించుకునే సమయం. మీరు కూడా ఓటు వేస్తున్నారా? తెలంగాణ ప్రజలారా రేపటి కోసం ఓటేయండి. మన బంగారు భవిష్యత్‌ నిర్మాణంలో భాగస్వాములైనందుకు గర్వపడండి.’’ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి

వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ కోసం ఇప్పుడే ఛార్జ్‌ తీసుకోండి. మీ హక్కును, విధులను బాధ్యతతో నిర్వర్తించండి. ఓటు వేయండి’’- డైరెక్టర్‌ కొరటాల శివ

చాలామంది నాకెందుకు? నాకేంటి? అనే భావన పెరిగిపోతోంది. ఓటేస్తే మనకు ఏం వస్తుంది.. హాయిగా ఇంట్లో కూర్చుందాం అనే ఆలోచన నుంచి బయటికి రావాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రసార మాధ్యమాలు సైతం ఇందుకోసం ప్రయత్నిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. ఇటువంటి వింత ధోరణితో భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందని ప్రజలు ఆలోచించాలి. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో మన హక్కు. ఓటు వేయడం వల్ల లాభమేంటని మాట్లాడేవారి అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు. తరుణ్‌ భాస్కర్‌, డైరెక్టర్‌

ఓటు అనేది దేశ, రాష్ట్ర భవిష్యత్తును మార్చగల ఆయుధం. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు, అధికారాన్ని కోల్పోతాం. ప్రతి ఓటూ విలువైనదే. అందుకే అందరూ ఈ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. వేసే ముందు ఆలోచించి అర్హుడైన అభ్యర్థిని ఎన్నుకోవాలి’’ రకుల్‌ప్రీతిసింగ్‌, హీరోయిన్‌

ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. ఇది అంత మంచి విషయం కాదని నేను భావిస్తున్నాను. ఓటేయడం చాలా ముఖ్యం. ప్రతి పౌరుడు ఎన్నికల్లో ఆ హక్కును వినియోగించుకోవాలి. ఎవరికి ఓటు వేయాలి..? ఎందుకు వేయాలి? అని ఆలోచించి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలుస్తుంది. డిసెంబరు 7వ తేదీ అందరూ గుర్తు పెట్టుకోండి’’ అమల, సినీ నటి

leave a reply