హోదా కోసం అందరితో కలిసి పోరాటం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల సాధన కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ప్రత్యేక జేఏసీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జేఏసీలో రాజకీయ పార్టీలతోపాటు, ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చెయ్యనున్నట్లు స్పష్టం చేశారు.

అఖిలపక్ష సమావేశానికి హాజరుకానీ పార్టీలను సైతం ఒక వేళ వస్తానన్న పక్షంలో జేఏసీలో భాగస్వామ్యం కల్పించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని సూచించారు. ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపును విజయవంతం చెయ్యాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

అలాగే, 11న ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళన చేస్తామని, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిలపక్షం వెళ్తుందని స్పష్టం చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ముగింపు రోజు దీక్ష చేపట్టనున్నట్లు చంద్రబాబు నిర్ణయించారు. ఈ అంశాలను అఖిలపక్ష సమావేశంలో తీర్మానంగా పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీపై కూడా ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తన కంటే నరేంద్ర మోదీ చాలా జూనియర్ అని అయినా ఆయన ఈగోను సంతృప్తిపరచాలని సర్ అని సంభోదించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ, ఏపీపై ప్రధాని కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరగబోయే కేబినేట్ లో ప్రత్యేక హోదా కోసం పోరాడినవారిపై కేసులు ఎత్తివేసేలా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

leave a reply