ఓట్ ఆన్ బడ్జెట్ కోసం మోడీ డబుల్ బొనాంజా

ప్రధాని నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారని, కానీ రాజకీయాలు కూడా చేయాలని, నాలుగున్నరేళ్ల పాటు దేశం కోసం ఆలోచించారని, ఈ ఆరు నెలలైనా రాజకీయం చేస్తే, 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచాక దేశం కోసం చూడవచ్చునని ఇటీవల పలువురు వ్యాఖ్యానించారు.

దానిని నిజం చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పేదలకు పది శాతం రిజర్వేషన్లు స్వతంత్ర భారతంలో సంచలన నిర్ణయం. దీనిని ఒకటి రెండు చిన్న పార్టీలు మినహా అన్ని పార్టీలు స్వాగతించాయి. అందుకే చాలా సులభంగా లోకసభలో, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ, ఆమోదం లభించాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది.

అలాగే, మరో అడుగు ముందుకేస్తూ.. చిన్న, మధ్య తరగతి వ్యాపారస్థుల జీఎస్టీని రూ.20 లక్షల నుంచి ర.40 లక్షలకు పెంచింది. తాజాగా, మోడీ ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగస్థులకు కూడా ఊరటనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.5 లక్షలకు ఆదాయపన్ను ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు మోడీ ప్రభుత్వం భారీ బొనాంజాను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇది నిజమేనా.. అదే జరిగితే మధ్యతరగతి ఉద్యోగుల ఆనందిస్తారు. లేదా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత కోసం జరుగుతున్న రివర్స్ ప్రచారమా అనేది ముందు ముందు తెలియనుంది. ఇక మోడీ ప్రభుత్వం ప్రకటించబోయే ఆ భారీ బొనాంజా ఆదాయపన్ను పరిమితి అంటున్నారు. ఈ పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని దాదాపు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రెట్టింపు చేస్తారన్నమాట. అదే జరిగితో కోట్లాది మంది మధ్య తరగతి వారికి భారీ ఊరట లభిస్తుంది. త్వరలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

2017లో కింది శ్లాబులో పన్ను రేటును తగ్గించారు. అప్పటి వరకు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల శ్లాబుకు 10 శాతం ఉండగా, దానిని ఐదు శాతానికి తగ్గించారు. ఈసారి ఆదాయపన్ను మినహాయింపును ఏకంగా రూ.5 లక్షలకు పెంచుతారని అంటున్నారు. రూ.5 లక్షలు కాకపోయినా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకైనా ఉంటుందా అనే చర్చ సాగుతోంది.

ఆదాయపన్ను పరిమితి పెంపుతో పాటు మెడికల్ ఖర్చులు, రవాణా భత్యం తదితర పన్ను మినహాయింపు జాబితాలో యథాతథంగా కొనసాగించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నోట్ల రద్దు తర్వాత ఇది ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారట.

leave a reply