కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌..

సుగంధ ద్రవ్యాలలో రారాజు మిరియాలు. అందుకే దీన్ని కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌ అన్నారు. ఒకప్పుడు భారత దేశంలో అత్యధికంగా పండేవి. ఆహారాల్లో రుచిని పెంచడానికి మిరియాలను వాడతారు. దీంతో ఆహారానికి మంచి రుచి, వాసన వస్తుంది. అంతే కాదు మిరియాలను ముఖ్యంగా ఔషధాలు తయారు చేయడంలో ఎక్కువగా వాడతారు. ఈ పద్ధతి మన దేశంలోనే ఎక్కువ. జలుబుకు, దగ్గుకు, గొంతు గర గరకు, ముక్కు దిబ్బడకు, అజీర్తికి ఇలా అనేక వ్యాధులకు మిరియాలను వాడతారు.

మిరియాలకు పుట్టిల్లు మనదేశంలో మలబార్ ప్రాంతమైనా చాల ప్రాంతాలలో వీటిని పండిస్తున్నారు. పోషకాల విషయానికొస్తే చిట్టి మిరియాలలో పీచు పదార్థం, ఐరన్, మాంగనీసు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్ళలో దొరుకు తాయి. కింగ్‌ ఆఫ్‌ స్పైసెస్‌గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్‌, చావిసైన్‌ గుణాలు శరీరంలో పేరుకున్న కఫాన్ని కరిగించడానికి తోడ్పడతాయి.

శరీరంలోనున్న అధిక కొవ్వును తగ్గించాలంటే మిరియాల రసం తాగితే మంచి ఫలితం వుంటుంది. దీనికి ఓ చిన్నగిన్నెలో నీరు తీసుకుని ఉప్పు, చిటికెడు ఇంగువ, పసుపు వేసి మరిగించాలి. దీనికి ఒక చెంచా మిరియాల పొడి చేర్చి మరోసారి మరిగించాలి. ఈ నీటికి జీలకర్ర, ఆవాల పోపు పెట్టాలి. వీలైతే కరివేపాకు, కొత్తిమిరి, వెల్లుల్లి, అల్లం, టమోటా వేసుకోవచ్చు.

జలుబు, దగ్గు, ఆయాసంగా ఉన్నప్పుడు..  గ్రాము మిరియాలు తీసుకుని దోరగా వేయించి పొడిచేసి.. చిటికెడు లవంగాల పొడి, పావుచెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకుని.. గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి.. తేనెతో రోజూ రెండు మూడుసార్లు చొప్పున తీసుకోవాలి.

కొందరు అధిక దప్పికతో బాధపడుతుంటారు. ఇలాంటివారు.. కాస్త మిరియాల పొడిని నీటితో స్వీకరిస్తే.. మంచిది. తరచూ జలుబు, తుమ్ములు వేధిస్తుంటే.. పసుపు, మిరియాలపొడిని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రిళ్లు తాగాలి. ముఖ్యంగా.. ఈ మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమినో యాసిడ్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్‌లా ఉపయోగపడుతాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు.

leave a reply