అమ్మాయిలు అదరగొట్టారు!

న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియా తిరుగులేని ప్రదర్శనను కనబరుస్తుంది. ఇప్పటికే పురుషుల జట్టు కివీస్ ఫై తిరుగులేని ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకోగా ఇప్పుడు మహిళల జట్టు విజయంతో సిరీస్ ను సొంతం చేసుకుంది. అటు పురుషులు.. ఇటు మహిళలు తిరుగులేని ప్రదర్శనతో కివీస్‌ను చిత్తుగా ఓడిస్తున్నారు. సోమవారం జరిగిన మూడో వన్డేలో గెలుపుతో కోహ్లీసేన వన్డే సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకోగా.. ఆతిథ్య జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో మహిళల జట్టు విజయం సాధించి 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య మంగళవారం రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ ఒడి బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ మిథాలీ సేన అద్భుతమైన బౌలింగ్‌తో 161 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో జులాన్‌ గోస్వామి(3), ఏక్తా బిష్త్‌ (2), దీప్తి శర్మ(2), పూనమ్‌ యాదవ్‌ (2)వికెట్లు పడకొట్టడంతో కివీస్‌ బ్యాటర్స్‌ తక్కువ పరుగులకే పరిమితమయ్యారు. కెప్టెన్‌ సాటర్‌వెయిట్‌ (71) మాత్రమే కాసేపు పోరాడగా మిగిలిన బ్యాటర్స్‌ రాణించలేకపోయారు.

162 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ డకౌట్‌ అవగా, ఫస్ట్‌ డౌన్‌ బ్యాటర్‌ దీప్తి శర్మ(8) కూడా త్వరగా పెవిలియన్ బాట పట్టింది. దీంతో భారత్‌ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మంధాన, మిథాలీ ఆచి తూచి ఆడుతూ స్కోరును ముందుకు తీసుకువెళ్లారు. ఈ మ్యాచ్‌లో మందాన (90), మిథాలీ(63) కలిసి 151 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విజయం సాధించారు.

leave a reply