కంగారెత్తించి.. చరిత్ర సృష్టించారు..

ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను భారత్‌ విజయంతో ప్రారంభించింది. అడిలైడ్‌ టెస్టులో ఆ జట్టుపై కోహ్లీసేన 31 పరుగుల తేడాతో చారిత్రక విజయం నమోదు చేసింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌ తొలిసారిగా టెస్టు విజయాన్ని నమోదు చేసింది. చివరిసారిగా 2008లో పెర్త్‌లో ఆసీస్‌పై విజయం సాధించింది. ఆసీస్‌ పర్యటనలో సిరీస్‌లో తొలి టెస్టు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ జట్టుతో ఆడిన 45 టెస్టుల్లో భారత్‌కు ఇది ఆరో విజయం మాత్రమే.

భారత్‌ నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్‌ 291 పరుగులకు ఆలౌటైంది. 104/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను టీమిండియా బౌలర్లు ఆదిలోనే దెబ్బ కొట్టారు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచి ప్రమాదమని భావిస్తున్న ట్రావిస్‌ హెడ్‌, షాన్‌ మార్ష్‌లను టీమిండియా బౌలర్లు త్వరగానే పెవిలియన్‌కు పంపారు. 57వ ఓవర్లో ఇషాంత్ బౌలింగ్‌లో హెడ్‌ 62 బంతుల్లో రహానెకు క్యాచ్‌ఇచ్చి ఔటయ్యాడు. నాలుగోరోజు నుంచి టీమిండియా బౌలర్లను ఎదుర్కొన్న షాన్ మార్ష్‌ను బుమ్రా బయటికి పంపాడు. 73వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని మార్ష్‌ 166 బంతుల్లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అయితే 101వ ఓవర్లో షమీ.. మిచెల్‌ స్టార్క్‌ను పెవిలియన్‌ పంపాడు. అయితే వెంటనే తొమ్మిదో వికెట్‌ తీయడానికి టీమిండియా బౌలర్లకు ఎంతో సమయం పట్టలేదు.. ఒకానొక దశలో మ్యాచ్‌ ఆసీస్‌ పరం అవుతుందేమో అనిపించేలా ఆసీస్‌ భారీ షాట్లు బాదింది. అయితే చివర్లో అశ్విన్‌ మాయాజాలం మరోసారి పని చేసింది. మరో 31 పరుగులు చేయాల్సి ఉండగా అశ్విన్‌ 120వ ఓవర్లో హేజిల్‌వుడ్‌ వికెట్‌ తీశాడు. దీంతో ఆసీస్‌ 291 పరుగులకే ఆలౌట్‌ అయింది.

భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌, షమి తలో మూడు వికెట్లు తీయగా.. ఇషాంత్‌ ఒక వికెట్‌ తీశాడు. నాలుగు టెస్టుల సిరీస్‌ భారత్‌ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

leave a reply