పెద్ద రాష్ట్రంలో… కీలక పొత్తు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు ఇకపై నిద్రలేని రాత్రులు గడపవల్సిందేనని బీఎస్పీ అధినేత్రి యాయావతి వ్యాఖ్యానించారు. బీజేపీకి అధికారం దక్కకుండా చేయడమే లక్ష్యంగా ఒకప్పటి ఆగర్భ శత్రువులైన బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కుదిరింది.  

బీఎస్పీ, ఎస్పీ రెండు పార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఇక అమేథి, రాయబరేలీ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీకే వదిలిపెట్టేశాయి. లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై ఇరు పార్టీల నేతలు శనివారమిక్కడ మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ…గతంలోనూ ఎస్పీ-బీఎస్పీ పొత్తు పెట్టుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. చరిత్రాత్మక అవసరం కోసమే కూటమి అవసరం అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు అవినీతికి పాల్పడ్డాయని మాయావతి ధ్వజమెత్తారు.

యూపీ ప్రజలు ప్రత్యామ్నయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. కొత్త రాజకీయ విప్లవానికి నాంది పలికేందుకే పొత్తులు పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో కోట్లాదిమంది ప్రజలు మోదీ పాలనపై కోపంగా ఉన్నారని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి బుద్ధి చెబుతామని మాయవతి అన్నారు.

పొత్తుల నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ ఈ సందర్భంగా మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చించలేదని, ఆ పార్టీకి యూపీలో బలం లేదని అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేవుడు కూడా బాధపడ్డారని ఆయన అన్నారు. కాగాఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉండే ఈ రెండు పార్టీలు యూపీలో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒకటయిన విషయం తెలిసిందే.

leave a reply