వాట్సప్ ఖాతా.. తొలగింపు.. కారణం మాత్రం చెప్పట్లేదు..!

ట్విట్టర్ ఖాతాలను ఆ సంస్థ బ్లాక్ చేసిందనే మాటలు విన్నాం..! ఫేక్‌ ఐడీల పేరుతో.. ఫేస్‌బుక్‌ కూడా కొన్ని అకౌంట్లను డిలీట్ చేసిందని విన్నాం..! ఇప్పుడు ఆ పని వాట్సాప్ కూడా చేస్తోందా..?. అంటే.. అవుననే అంటున్నారు… తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఆయన వాడుతున్న వాట్సాప్ హఠాత్తుగా పని చేయడం మానేసింది. టెక్నికల్ ప్రాబ్లం అనుకుని ఫోన్ మార్చినా ప్రయోజనం లేపోయింది. విషయం ఏమిటా .. అని వాట్సాప్ సంస్థ దగ్గర ఆరా తీస్తే… “మీరు నిబంధనలు ఉల్లంఘించారనే” సమాధానం వచ్చిందట..!. ఏం నిబంధనలు అంటే మాత్రం.. సమాధానం రాలేదంటున్నారు తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్..!

అయితే.. తన వాట్సాప్ నిలిచిపోవడం వెనుక.. కచ్చితంగా కేంద్రం కుట్ర ఉందని సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ఎన్నో వాట్సాప్ గ్రూపుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాల సందేశాల ద్వారానే వాట్సాప్ ద్వారనే వెళ్తూ ఉంటాయి. ప్రధానంగా ఢిల్లీకి సంబంధించిన టీడీపీ పోరాటాలను ఎలా ప్లాన్ చేయాలన్న దానిపై సీఎం రమేష్.. ఇతర నేతలు వాట్సాప్ ద్వారా టచ్‌లో ఉంటున్నారు.

కేంద్రం, ఇతర నిఘా సంస్థలు టీడీపీ నేతలపై ఇప్పటికే నిఘా పెట్టాయి. వారికి తమ పోరాట ఆలోచనలు ఏమిటో తెలియకుండా టీడీపీ నేతలు వాట్సాప్ ద్వారానే వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ప్రధానంగా సీఎం రమేష్ వాట్సాప్ పని చేయకపోతే ఈ నెట్ వర్క్ అంతా ఆగిపోతుందన్న ఉద్దేశంతో కావాలనే ఆయన వాట్సాప్ దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదులు.. ఆ సంస్థకు వెళ్లినట్లు టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే సీఎం రమేష్.. కేంద్రప్రభుత్వమే కావాలని చేయించిందనే ఆరోపణలు చేస్తున్నారు.

నిజానికి ఇప్పటి వరకూ వాట్సాప్ నిబంధనలు ఉల్లంఘిస్తే దాన్ని నిలుపుదల చేస్తారనే విషయం బయటకు తెలియదు. వాట్సాప్‌కు ఎలాంటి నిబంధనలున్నాయి..? ఎలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే ఆపేస్తారు అన్నదానిపైనా వివరణ లేదు. కానీ కేంద్రం మాత్రం ఇటీవలి కాలంలో వాట్సాప్‌పై చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది.

ఫేక్‌న్యూస్‌లు ఫార్వార్డ్ చేస్తున్నారని కట్టడి చేయకపోతే ఇండియా నుంచి తరిమేస్తామని కూడా ఓ దశలో హెచ్చరించారు. ఆ తర్వాత వాట్సాప్ కొన్ని సంస్కరణలు తెచ్చింది. ఓ న్యూస్ ఐదుగురికన్నా ఎక్కువగా ఫార్వార్డ్ చేయలేకపోవడం ఒకటి. అలాంటివి అమలవుతున్న సమయంలో ఎవరినీ బ్లాక్ చేసినట్లు మాత్రం ఆ సంస్థ ప్రకటించలేదు. తొలి సారిగా ఓ రాజ్యసభ సభ్యుడి అకౌంట్ ను బ్లాక్ చేసింది.

అడిగే వరకూ ఆ విషయం చెప్పలేదు. కేంద్రం ఒత్తిడి చేసి ఇలా రాజకీయ ప్రత్యర్థుల వాట్సాప్‌ను బంద్ చేయిస్తోందనే అనుమానాలు కలగడానికి ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు విశ్లేషకులు.

leave a reply