సిట్టింగులకు షాకుల మీద షాకులు

ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న కొద్దీ తెలుగుదేశంపార్టీలో సిట్టింగులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టిడిపిలో ఇది నిజంగా కొత్త పోకడే. తాడికొండ నియోజకవర్గంలో ఎంఎల్ఏ శ్రవణ్ కుమార్ కు రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వద్దంటూ తీర్మానం చేసి చంద్రబాబుకు పంపారు. గతంలో ఏదో అక్కడక్కడ మాత్రమే కనిపించిన ఈ పోకడ ఇపుడు చాలా నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. ఫలితంగా సిట్టింగ్ ఎంఎల్ఏలకే కాదు ముందు ముందు చంద్రబాబునాయుడుకు కూడా తలనొప్పులు తప్పేట్లు లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే,  తమ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంఎల్ఏలకు, ఎంపిలకు మళ్ళీ టిక్కెట్లు ఇవ్వద్దంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి.

రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో సుమారు 40 నియోజకవర్గాల్లో ఇటువంటి డిమాండ్లు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న డిమాండ్లను చూస్తుంటే పార్టీలోనే సిట్టింగులపై ఎంతస్ధాయిలో వ్యతిరేకత ఉందో అర్ధమైపోతోంది. పైన చెప్పుకున్న 40 నియోజకవర్గాల్లో ముందు వరసలో 22 ఫిరాయింపుల నియోజకవర్గాలే ఉన్నాయట. వీళ్ళందరికీ మళ్ళీ టిక్కెట్లిస్తే గెలిచేది కల్లే అంటూ పార్టీ నేతలు సమావేశాలు పెట్టుకుని ఏకంగా తీర్మానాలే చేసి చంద్రబాబుకు పంపుతున్నారు.

ఫిరాయింపు నియోజకవర్గాలు కాకుండా గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎంఎల్ఏ శ్రవణకుమార్, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ఎంఎల్ఏ కదిరి బాబురావు, కొండెపిలో ఎంఎల్ఏ బాల వీరాంజనేయస్వామి, చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎంఎల్ఏ సుగుణమ్మ, చిత్తూరు ఎంఎల్ఏ డికె సత్యప్రభ, కడప జిల్లాలోని రాజంపేట ఎంఎల్ఏ మేడా మల్లికార్జున రెడ్డి, అనంతపురం జిల్లా శింగనమల ఎంఎల్ఏ యామినీ బాల, పుట్టపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డి, ఇలా మరో ఐదుగురు సిట్టింగుల విషయంలో పార్టీ నేతలే బాగా అసంతృప్తిగా ఉన్నారట.

 వచ్చే ఎన్నికల్లో అసలు తమకు టిక్కెట్లు వస్తాయో రావో అన్న టెన్షన్లో ఎంఎల్ఏలున్నారు. ఒకటికి పదిసార్లు చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేలు సిట్టింగుల్లో గుబులు రేపుతోంది. ఇటువంటి సమయంలోనే తమకు వ్యతిరేకంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు సమావేశాలు పెట్టుకోవటం, టిక్కెట్లు ఇవ్వద్దంటూ తీర్మానాలు చేసి చంద్రబాబుకే పంపుతుండటంతో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఈ సమస్య ఎంఎల్ఏలకే కాదు ఎంపిలను కూడా వదలటం లేదు. గుంటూరు, నంద్యాల ఎంపిలు గల్లా జయదేవ్, ఎస్పీవై రెడ్డికి టిక్కెట్టు ఇవ్వద్దంటూ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి పెడుతున్నారట. తన సర్వే నివేదికలకు తోడు నేతలు పంపుతున్న తీర్మానాలను కూడా చంద్రబాబు ఫైల్ చేసుకుంటున్నారని తెలియటంతో సిట్టింగులకు దిక్కుతోచటం లేదు.

leave a reply