ఫ్యాషన్‌గా చిరిగిన జీన్సులు

ఇప్పుడున్న ట్రెండ్‌ ఫ్యాషన్‌ యుగంలో ఎటు చూసినా జీన్సులే. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ వేసేసుకుంటున్నారు. ఇక టీనేజీ అమ్మాయిల గురించి అయితే చెప్పనవసరంలేదు. వాళ్లు పడే హైరానా అంతా ఇంతా కాదు. పార్టీలకని, డైలీ వేర్‌ అనీ సపరేట్‌ సపరేట్‌ జీన్సులు. ఇప్పుడంతా జీన్సుల మయమైంది. కొత్త కొత్త రకాల జీన్స్‌లు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. స్కిన్నీ, బాయ్‌ ఫ్రండ్‌, క్రాఫ్డ్‌, రిప్డ్‌ జీన్స్‌ అని ఇలా అనేక రకాలు ఉన్నాయి. అందులోనూ మరీ చిరిగిన జీన్సులు వేస్తే ఇంకా ట్రెండ్‌ అట.. దాన్నే ట్రెండీ లుక్‌ అంటారట. ఎవరు చూడు అవే.. మోకాళ్ల మీదనో లేక కిందనో, పైననో చిరిగి ఉండటమనేది కామన్‌. మరి ఆ చిరుగుల గోలేంటో ఓ లుక్కేసేయండి..!

రిప్డ్‌ జీన్స్‌… అదే ట్రెండ్‌ ఇప్పుడు. స్కిన్‌టైట్‌, స్ట్రెయిట్‌కట్‌, బ్యాగీ స్టైల్‌ జీన్స్‌ ఏదైనా కావొచ్చు. అది రిప్డ్‌ రకమై ఉండాలి. పది పదిహేనేళ్ల క్రితం ఉన్న ఫ్యాషన్‌ ఇప్పుడు మళ్లీ కొత్తగా సందడి చేస్తోంది. అందుకే ప్రముఖ బ్రాండ్‌లూ రిప్డ్‌ బాట పట్టాయి. చిరిగిన ప్యాంట్‌ అనడం కన్నా… ఓ పద్ధతిలో చించిన ప్యాంట్‌ అనొచ్చేమో! గమనిస్తే…రెండింటికీ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది.

ఈ రిప్డ్‌ జీన్స్‌ ప్రధానంగా స్క్రాప్‌, ష్రెడ్‌, హోల్‌… వంటి మూడురకాల్లో లభిస్తుంది. జీన్స్‌పై అక్కడక్కడా చిన్న చిన్న రంధ్రాల్లా ఉండటమే స్క్రాప్‌. చిరుగుల జీన్స్‌ వేసుకోవాలని ఉన్నా… వెనకడుగు వేసేవారికి చక్కని ఎంపిక ఈ రకం. మీ శరీరానికి నప్పే జీన్స్‌ రకంలో ఈ స్క్రాప్‌ స్టైల్‌ని ఎంచుకుంటే ఆకట్టుకోవచ్చు. ఇక రెండో రకం ష్రెడ్స్‌. దీన్ని చూస్తే చిరిగినట్లే కనిపిస్తుంది. కానీ ఆ చిరుగుల్లో తెల్లటి దారం పోగులు ఉంటాయి. అవి చర్మాన్ని కనపడకుండా కప్పేస్తాయి. ఇక మూడో రకం హోల్‌. స్పష్టంగా శరీరం కనిపించేలా చిరుగు ఉండటమే దీని ప్రత్యేకత. దీనికి మోకాళ్ల దగ్గర ఎక్కువగా  చిరుగులు కనిపిస్తాయి. జతగా క్రాప్‌టాప్‌, టీషర్టుల్లాంటివి  వేసుకుంటే ఆ అందమే వేరు అంటారు ఫ్యాషన్‌ నిపుణులు

కాస్త సన్నగా ఉండేవారు, శరీరాకృతి చక్కగా కనిపించాలని కోరుకునేవారు స్కిన్నీ రిప్డ్‌ జీన్స్‌ని ఎంచుకోవచ్చు. అదే కాస్త లావుగా ఉండి, ప్రయత్నించాలనుకునేవారు చిరుగులు ఉండే హైవెయిస్టెడ్‌, బాయ్‌ఫ్రెండ్‌ జీన్స్‌ వంటివాటిని ప్రయత్నించొచ్చు. వీటిమీదకు ట్యూనిక్‌ టాప్‌లు  బాగుంటాయి. ఈ జీన్స్‌ రకాల మీదకు జతగా స్నీకర్స్‌, కాన్వాస్‌ షూస్‌ వంటివి  సరైన ఎంపికవుతాయి.

leave a reply