మెరిసిన కివీస్… మంధాన తప్ప!

వెల్లింగ్టన్‌: గెలపు ఖాయమనుకున్న మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్నటీ20 సిరీస్‌ మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విఫలమైంది.  భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (58) తప్ప మిగిలిన క్రీడాకారిణులు పెద్దగా రాణించలేకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌ ఆరంభించిన  కివీస్‌ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగా.. ఛేదనకు దిగిన హర్మన్‌ప్రీత్‌ సేన 136 పరుగులకే అల్ అవుట్ అయింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకొని న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్దేశిత 20 ఓవర్లలో కివీస్‌ జట్టు 159/4 పరుగులు చేసింది. సోఫీ డివైన్‌(62) అర్ధశతకంతో రాణించగా, కెప్టెన్‌ సట్టెర్‌వెయిట్‌ (33), కేజే మార్టిన్‌(27) పరుగులతో ఆకట్టుకున్నారు. భారత మహిళల్లో అరుంధతి రెడ్డి, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మలకు తలో వికెట్‌ దక్కింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో  హర్మన్‌ప్రీత్‌ సేన తడబడింది.

అరంగేట్ర బ్యాటర్‌ ప్రియా(4) తొలి ఓవర్లోనే తీవ్రంగా నిరాశపరిచింది.  ఆ తర్వాత  క్రీజులోకి వచ్చిన రొడ్రిగస్‌తో కలిసి ఓపెనర్‌ స్మృతి మంధాన జట్టును ఆదుకునే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో స్మృతి అర్ధ శతకంతో మెరవగా, అయితే పక్క పక్క ఓవర్లలో  వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌విమెన్‌ ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు.

దీంతో హర్మన్‌సేన 136 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బౌలర్లలో తాహుహు 3 వికెట్ల తీయగా, కస్పెరెక్‌, కేర్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. డివైన్‌, మేర్‌, సట్టర్‌వైట్‌లకు తలో వికెట్‌ దక్కింది.. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ జట్టు 1-0తో ముందంజలో ఉంది.

leave a reply