రసకందాయంలో నెల్లూరు రాజకీయం..!

టీడీపీలో రాజకీయ కదలికలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామీణ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో ఆశావహుల్లో నిరాశ ఆవరించింది. పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ.. పార్టీని ఎన్నికల వరకు తీసుకెళ్లే విధంగా కసరత్తును మొదలుపెట్టారు. ఆదాలకు టిక్కెట్టును అధికారికంగా ఖరారు చేయడం.. అదే సమయంలో నెల్లూరు నగరం, సర్వేపల్లి నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయంగా ఒక్కసారిగా హడావుడి మొదలైంది. దాదాపు ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో అసంతృప్తులను సర్దుబాటు చేసే పక్రియను కూడా మరోవైపు మొదలుపెట్టారు. ఇందుకు పార్టీ నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేశారు. నియోజకవర్గాల వారీగా ఉన్న అసంతృప్తులను ఓదార్చుతూ.. పార్టీ అధికారిక అభ్యర్థిని గెలిపించేవిధంగా వ్యూహాలను రూపొందించడంలో కమిటీ నిమగ్నం కానుంది.

నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి ఆదాల ప్రభాకరరెడ్డి బరిలో ఉంటారని మొదటి నుంచి భావిస్తూ వచ్చారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గాన్ని ఆదాలకు కట్టబెడుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇదే స్థానం నుంచి టిక్కెట్టు ఆశించిన మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి ఒకింత నిరాశకు గురయ్యారు. పెళ్లకూరు గ్రామీణ టిక్కెట్టు కంటే మొదటి నుంచి కోవూరు టిక్కెట్టు ఆశించారు. అయితే అనూహ్యంగా ఆయన పేరును గ్రామీణ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో ఆదాలకు టిక్కెట్టు ఖరారు కావడంతో అందరికీ నిరాశ ఎదురైంది. ఇప్పుడు టిక్కెట్టు ఆశించిన నేతలను బుజ్జగించడం పెద్ద పనిగా మారింది. పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, జయకుమార్‌రెడ్డిలకు ఆదాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో టిక్కెట్టు ఆశించి భంగపడిన నేతలను సర్దుబాటు చేయడానికి నేరుగా సీఎం చంద్రబాబు దగ్గర సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

టిక్కెట్టు ఆశించిన నేతలు పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌, ఆత్మకూరు నియోజకవర్గ నాయకుడు కన్నబాబును రాజధాని అమరావతికి వచ్చి కలవాలని రాష్ట్ర పార్టీ నుంచి ఇప్పటికే ఆదేశాలు అందినట్టు సమాచారం. ఈనెల 13వ తేదీ తర్వాత సీఎం అందుబాటులో ఉన్న సమయంలో రాజధానికి వచ్చేందుకు సిద్ధం కావాలని చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం దగ్గర ఏదో ఒక హామీని వీరికి ఇప్పించడం   ద్వారా బుజ్జగించి.. పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇచ్చి వారు చక్కగా పనిచేసేవిధంగా చేయాలని భావిస్తున్నారు.

జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను సర్దుబాటు చేసి.. పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసే బాధ్యతలను ముగ్గురు సభ్యుల కమిటీకి పార్టీ అప్పగించింది. ఈ కమిటీలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ఉంటారు. నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి ఎప్పటికప్పుడు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లడమే కమిటీ బాధ్యతగా ఉంది. 

టిక్కెట్టు దక్కక నిరుత్సాహానికి గురైన జయకుమార్‌రెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డిలతో సభ్యులు వెంటనే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పరిష్కారమైన తర్వాత ఇతర నియోజకవర్గాలపై పార్టీ దృష్టి పెట్టనుంది. జిల్లాలో సంప్రదింపులు పూర్తయిన తర్వాత సీఎం అందుబాటులో ఉన్న సమయంలో అమరావతికి తీసుకెళ్లి అక్కడ సీఎంతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.

నెల్లూరు నగరం, గ్రామీణం నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్న నగర మేయర్‌ అజీజ్‌కు జిల్లా తెలుగుదేశం పార్టీ, నాయకులు, మంత్రులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు అందరూ కలసి మోసం చేశారని, ఆయా నియోజకవర్గాలను మంత్రి నారాయణ, ఆదాల ప్రభాకర్‌రెడ్డికి కేటాయించేసి మొండిచేయి చూపారంటూ నగరంలోని మైనారిటీ నాయకులు, మతపెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం  నుంచి అర్ధరాత్రి దాటేవరకు నగరంలోని పలు చోట్ల ఈ తరహా అసంతృప్తి నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు.

మేయర్‌ అలకబూనారని గ్రహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర రాత్రి 7 గంటల నుంచి 9.30 వరకు మాగుంటలేవుట్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమై.. చర్చించారు. ఆయన్ను బుజ్జగించారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల నుంచి మళ్లీ మైనారిటీ నాయకులు ముందుగా కార్పొరేషన్‌ కార్యాలయంలో సమావేశమై.. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న బీద రవిచంద్ర మేయర్‌తోపాటు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారందర్నీ తన గదిలోకి పిలిపించి శాంతింపజేసేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారంతా అజీజ్‌కు ఎమ్మెల్యే టికెట్టుగాని, నెల్లూరు ఎంపీ టికెట్టుగాని ఇవ్వాలని, జిల్లాలో ఉన్న ముస్లిం, మైనారిటీలంతా ఇదే కోరుతున్నారని ఆయనకు తెలిపారు. ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని, మీ డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళతానని, అజీజ్‌ తనకు మంచి మిత్రుడని, ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని సీఎం చెబుతున్నారని వారికి తెలిపారు. ఎమ్మెల్సీ వద్దని, ఎమ్మెల్యేగాని, ఎంపీ టికెట్టుగాని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు.  ఈ విషయమై సుదీర్ఘంగా అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటలవరకు చర్చ జరిగింది.

leave a reply