రాష్ట్రపతి పాలన విధించేస్తాడట..!

ఢిల్లీలో ఉన్న అధికారం మహిమో ఏమో కానీ ఉత్తరప్రదేశ్‌ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికయిన జీవీఎల్ నరసింహారావు.. దేశంలో తనకంటే.. గొప్ప నేత లేడన్నట్లు ఫీలవుతున్నారు. రాజ్యాంగాలు, చట్టాలు అంటే.. తను చెప్పినవే అని అనుకుంటున్నారు ఆ రాజ్యసభ ఎంపీ.

ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీజేపీకి టాటా చెప్పెసిందో అప్పటి నుంచి ఆయన ఇదే తరహా వాదనలు వినిపిస్తున్నప్పటికీ…  ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన మరింతగా చెలరేగిపోతున్నారు.

“ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించేయగలను జాగ్రత్త” అని నేరుగా హెచ్చరికలు కూడా జారీ చేసేస్తున్నారు. ఇలాంటి మాటలు ఆయన నోటి నుంచి ఎప్పుడూ వస్తునే ఉన్నా  ఓ సారి కన్నా లక్ష్మినారాయణను.. ఓ లారీ డ్రైవర్.. కావలిలో చెప్పుతో కొట్టినప్పుడు…  అంతకు ముందు తిరుమలలో అమిత్ షా కాన్వాయ్‌కి ఎదురుగా నిలబడి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపినప్పుడు కూడా… జీవీఎల్ ఇలానే బావురుమన్నాడు.

విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడికత్తి దాడి జరిగిన క్షణాల్లోనే ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్‌ చేశారు. ఇప్పుడు కొత్తగా.. కొంచెం లేటుగా మరోసారి అలాంటి డిమాండ్ చేశారు. ఈ సారి ఎందుకంటే..” ఏపీ ప్రజల నిరసనలకు భయపడి… ప్రధాని ఏపీ పర్యటనను వాయిదా వేసుకున్నారని”… టీడీపీ నేతలు విమర్శించడమట.

ఈ నెల మొదట్లో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఏపీ పర్యటనకు రావాలనుకున్నారు. కానీ.. పరిస్థితి తేడాగా ఉందని ఇంటలిజెన్స్ నివేదికలు వెళ్లడంతో ఎందుకైనా మంచిదని..మోడీ మిడిల్ డ్రాప్ అయ్యారు. ఏపీకి చేసిన అన్యాయంపై  ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పర్యటన వాయిదా వేసుకున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు కూడా అదే విధంగా చెబుతున్నారు.

ఈ మాటలు బీజేపీ నేతలకు సూటిగానే గుచ్చుకుంటున్నాయి. తనకు రాజ్యసభ సీటు ఇచ్చిన మోడీని దైవంగా చూస్తున్న జీవీఎల్‌ను ఈ మాటలు మరింతగా బాధిస్తున్నట్లున్నాయి. అందుకే… అల్టిమేట్‌గా రాష్ట్రపతి పాలన హెచ్చరికలు చేస్తున్నారు.

” టీడీపీకి భయపడే ప్రధాని పర్యటన వాయిదా వేసుకున్నారనే ప్రగల్భాలను చంద్రబాబు మానుకోవాలని, అదే జరిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని” విజయవాడలో బాధతో జీరబోయిన గొంతుతో.. హెచ్చరికలు పంపారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి.. ఒక్క మాట మాట్లాడలేని.. జీవీఎల్ లాంటి నేతలు… ప్రజాప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు బ్లాక్ మెయిల్ చేయడానికి… తాము చెప్పిందే రాజ్యాంగమన్నట్లుగా.. వ్యవహరిచడానికి సిద్ధపడుతూంటారు. 

కాగా, ఏపీలో ఇక ముందు జీవీఎల్ పర్యటించేచోట్ల..” బీవేర్ ఆఫ్ జీవీఎల్” అని బోర్డులు తగిలించాల్సి వస్తుందన్నట్లుగా ఆయన హుంకరిపులు, బెదిరింపులు సాగుతున్నాయి.

leave a reply