రజత్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఎన్నికల కమిషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుకూలంగా ఎన్నికల సంఘం పని చేసిందన్నారు. ఎన్నికల అధికారి రజత్ కుమార్ టిఆర్ఎస్ తొత్తుగా ప్రవర్తించాడన్నారు.

“ప్రభుత్వ యంత్రాంగాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొంత పనులకు వాడుకుంటోంది. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రభుత్వ అధికారులే డబ్బులు పంచారు. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు. దీంతో ఓటరు జాబితాను సవరిస్తామని ఎన్నికల సంఘం చెప్పింది. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై అనుమానాలు ఉన్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను తీసుకొచ్చారు. అభ్యర్థులకు అనుమానాలు ఉన్నచోట వాటి స్లిప్పులను లెక్కించాల్సి ఉంది. అయినా ఆ పని చేయలేదు. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహారశైలిపై అందరికీ అనుమానాలు ఉన్నాయి. రజత్ కుమార్ పై విచారణ జరిపించాలి. కంచే చేను మేసినట్టుగా ఎన్నికల సంఘం ప్రవర్తించడం సరికాదు. ఎన్నికల సంఘంపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు గతంలో ఎన్నడూ రాలేదు.

ఎన్నికల సంఘం అధికారుల తీరు పై సర్వత్రా విమర్శలు ఉన్నాయి. రజత్ కుమార్‌ను వెంటనే ఈసీ బాధ్యతల నుంచి తప్పించాలి. మరో రెండు నెలల్లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా రజత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల ఫార్మాట్‌ను అమలు చేస్తాడు. అతనిని వెంటనే తప్పించాలి. అధికార పార్టీకి అనుకూలంగా ఎన్నికల అధికారి ప్రవర్తించాడు.

రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉండి కొందరి తొత్తులుగా వ్యవహరించారు. నోర్మూసుకొని కూర్చుంటే ఇంకా ఎక్కువగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి విధానాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. వెంటనే రజత్ కుమార్ ను ఎన్నికల కమిషనర్‌గా తప్పించి ఆయన స్థానంలో సమర్ధుడైన అధికారిని నియమించాలి” అని కోదండరాం అన్నారు.

leave a reply